సాంబా.. చంపేయబోయింది

2 May, 2018 22:16 IST|Sakshi

కేప్‌టౌన్‌ : మచ్చిక చేసుకున్నవైనా.. మన ఆధీనంలోనే ఉన్నా క్రూర జంతువుల దగ్గర చాలా జాగ్రతగా ఉండక తప్పదు. లేకపోతే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. దక్షిణాఫ్రికాలో తాజాగా జరిగిన ఓ సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఓ జూ యజమానిపై సింహం దాడికి దిగగా.. ఆయన అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. బ్రిటన్‌కు చెందిన మైక్‌ హాడ్జ్‌(67) కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాలోని లింపోపో ప్రావిన్స్‌లో మారకెలె శాంక్చురీ పేరుతో జూ నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రకాల జంతువులతోపాటు సాంబా అనే పేరు గల సింహం ఉంది.

గత సోమవారం (ఏప్రిల్‌ 30) జూకు వచ్చిన సందర్శకులకు వివరాలు చెబుతూ.. ఏదో దుర్వాసనను గమనించిన హాడ్జ్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లారు. అదే సమయంలో దూరం నుంచి సింహం రావడం చూసి సహాయం కోసం కేకలు వేస్తూ గేటు వైపు పరిగెత్తాడు. అయితే ఈ లోపలే ఆయన మీద సింహం దాడి చేసి పొదల్లోకి లాక్కెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి సందర్శకుల్లో ఎవరో రైఫిల్‌తో కాల్చడంతో సింహం ఆయన్ని వదిలేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, సింహం నుంచి తప్పించుకునేందుకు హాడ్జ్‌ పరిగెత్తడం, సింహం ఆయన్ని నోట కరుచుకొని లాక్కెడం రికార్డయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.   

మరిన్ని వార్తలు