కంటి చికిత్సకు ముందు మ్యూజిక్ వింటే...

31 May, 2016 17:19 IST|Sakshi
కంటి చికిత్సకు ముందు మ్యూజిక్ వింటే...

ఫ్రాన్స్ః సంగీతం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించి, మానసికోల్లాసాన్ని కలిగించే సంగీతం ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు కూడ సహకరిస్తుంది. సంగీతం అనేక బాధలనుంచి స్వాంతన పొందేట్టు చేస్తుంది. అయితే కంటికి శస్త్ర చికిత్స చేయించుకునే ముందు కాసేపు సంగీతం వినడం ఆందోళన తగ్గించేందుకు మంచి సాధనం అంటున్నారు ఫ్రాన్స్ పరిశోధకులు. కాసేపు సంగీతం విన్న తర్వాత శస్త్ర చికిత్సకు వెళ్ళడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు.

మ్యూజిక్ వినండం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని, ముఖ్యంగా కంటి ఆపరేషన్ చేయించుకునే వారు ఎనస్థీషియా తీసుకునేందుకు ముందు.. కొద్ది సమయం మ్యూజిక్ వినడంవల్ల ఆందోళన తగ్గుతుందని అంటున్నారు ఫ్రాన్స్ లోని కొచిన్ యూనివర్శిటీ ఆస్పత్రికి చెందిన గిల్లెస్ గ్యూరియర్. ముఖ్యంగా శస్త్ర చికిత్స సమయంలో మెలకువతో ఉండటం రోగులకు ఆందోళనను, ఒత్తిడిని కలుగజేస్తుంది. అదే నేపథ్యంలో  కాసేపు సంగీతం విన్నవారు, వినకుండా సర్జరీకి వెళ్ళిన వారిపై అధ్యయనాలు జరిపిన పరిశోధకులు ఇద్దరికీ మధ్య ఆత్రుతలో గణనీయమైన తేడా కనిపించినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా ప్రతి వందమందిలో సంగీతం విన్నవారికంటే... వినకుండా సర్జరీకి వెళ్ళినవారికి మత్తుమందుల అవసరం ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. సంగీతం విన్న పేషెంట్లకు మత్తు మందులు 16 శాతం అవసరమైతే, లేని వారికి 32 శాతం అవసరమైనట్లు చెప్తున్నారు. అంతే కాక మ్యూజిక్ విన్నవారిలో ఆపరేషన్ తర్వాత కూడ  ఫలితాలు పాజిటివ్ గా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల కంటి శస్త్ర చికిత్సలకు ముందు సంగీతం అందిస్తున్నామని, అలాగే లోకల్ ఎనస్థీషియా ఇవ్వాల్సి వచ్చే ఎముకలతో సహా ఏ రకమైన ఆపరేషన్ కైనా సంగీతం వినిపించే పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు యోచిస్తున్నామని గ్యూరియర్ చెప్తున్నారు.

కాటరాక్ట్ సర్జరీ చేయించుకునే ముందు పేషెంట్లు  దాదాపు 15 నిమిషాల పాటు జాజ్, ఫ్లామెన్కో క్యూబన్, క్లాజికల్, పియానో, వంటి విభిన్న శైలుల్లోని సంగీతం వినడంవల్ల నొప్పిని తట్టుకొని, ఆందోళన చెందకుండా, ఆత్రుత పడకుండా ఆపరేషన్ సమయంలో చక్కగా వ్యవహరించగలిగినట్లు తమ పరిశోధనల్లో తేలిందని,  శస్త్ర చికిత్స వల్ల కలిగే భయయాన్ని పోగొట్టేందుకు వినిపించే మ్యూజిక్ వినడానికి ముందు, తర్వాత... సర్జికల్ ఫియర్ క్వశ్చనీర్ (ఎస్ఎఫ్ క్యూ)  ను ఉపయోగించి ఆందోళనను అంచనా వేసినట్లు పరిశోధకులు లండన్ యూరో ఎనస్థీషియా 2016 లో నివేదించారు.

మరిన్ని వార్తలు