అదరగొడుతున్న బుల్లి బ్రూస్‌ లీ

29 Oct, 2017 01:10 IST|Sakshi

జపాన్‌కు చెందిన యుసేయి ఏడాదిన్నర వయసులో ఉండగానే అతని తల్లిదండ్రులు ఎక్సర్‌ సైజులపై పిల్లాడు దృష్టిసారించేలా చేశారు. అలా కొన్నాళ్లపాటు వాళ్ల పర్యవేక్షణలోనే రాటుదేలిన యుసేయి... నాలుగేళ్లకే సొంతంగా ఫిట్‌నెస్‌ కేర్‌ తీసుకోవటం ప్రారంభిం చాడు. ఏడాది నుంచే బ్రూస్‌లీ సినిమాలు చూడటం మొదలుపెట్టిన యుసేయి  ఆ ప్రేరణతో మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ తీసుకుని..ఐదేళ్లకే మార్షల్‌ కింగ్‌గా మారిపోయాడు. ఈ సిక్స్‌ ప్యాక్‌ బుడ్డోడిపై అంతర్జాతీయ మీడియాలూ ప్రత్యేక కథనాలు ప్రచురించడం విశేషం.  

అతని పంచ్‌ పవర్‌ చూసిన మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణులు సైతం నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఓ 20 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఉండేంత బలం అతని పిడికిలికి ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  రెండేళ్ల క్రితం సూపర్‌ కిడ్స్‌ అనే ఓ  ప్రోగ్రాంలో తన గురువు బ్రూస్‌ లీ నటించిన గేమ్‌ ఆఫ్‌ డెత్‌ చిత్రంలోని ఫైట్‌ సీక్వెన్స్‌ను తీసుకుని.. వెనకాల స్క్రీన్‌పై అది ప్రదర్శితమౌతుంటే.. అచ్చంగా అదే హావభావాలతో ప్రదర్శించి అందరిచేత విజిల్స్‌ వేయించుకున్నాడు. చదువుల్లో కూడా ఈ పిల్లాడు చాలా చురుకుగా ఉంటాడని టీచర్లు చెబుతున్నారు. అయితే ఫైట్‌ సమయంలో దూకుడు చూపించే యుసేయి.. తోటి విద్యార్థుల వద్ద మాత్రం చాలా ప్రశాంతంగా ఉండడం గమనార్హం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు