చిన్నారికి ఎంత కష్టం..

12 Oct, 2017 07:29 IST|Sakshi

న్యూ సౌత్‌ వేల్స్‌ :                    
ఐదేళ్ల ప్రాయంలోనే జీవిత కాలంలో అనుభవించే కష్టాలన్ని అనుభవిస్తోంది ఓ చిన్నారి. 4 ఏళ్ల చిరు ప్రాయంలోనే చిన్నారికి పీరియడ్స్ రావడం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌కు చెందిన  ఎమిలీ డోవర్స్ అనే ఐదేళ్ల బాలిక ఆడిసన్స్ వ్యాధి బారిన పడింది. దీంతో హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేస్తే 5 ఏళ్లకే మోనో పాజ్ దశకి చేరుకోనుంది. అడ్రినల్‌ గ్రంథికి వచ్చే చాలా అరుదైన వ్యాధి ఇది. రెండు హార్మోన్లు కార్టిసోల్‌, ఆల్డోస్టిరాన్‌ల లోపంతో చిన్నారి ఇబ్బంది పడుతోంది. సాధారణంగా ముప్పై ఏళ్లుపైబడిన వారిలోనే చాలా అరుదుగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

పుట్టినప్పుడు అందరి పిల్లల్లానే ఎమిలీ డోవర్స్ మామూలుగా, సంతోషంగానే ఉండేది. అయితే రెండు వారాలు గడవగానే చిన్నారి పెరుగుదల అసాధారణంగా మారింది. నాలుగు నెలలకే ఏడాది చిన్నారిలా కనిపించేది. ఎమిలీ రెండేళ్ల వయస్సులోనే రొమ్ముల పెరుగుదల, శరీరం నుంచి వాసన రావడం, చర్మంపైన దద్దుర్లు రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత అవాంచిత రోమాలు, మొటిమలు రావడం కూడా ప్రారంభమయ్యాయి. అడిసన్స్ వ్యాధితో పాటూ పుట్టుకతో వచ్చిన అడ్రినల్ హైపర్ ప్లాసియా, సెంట్రల్ ప్రికాసియస్ పబర్టీ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెన్సరి ప్రోసెసింగ్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నట్టు వైద్యుల పరీక్షల్లో తేలింది.

మిగతా పిల్లలకన్నా తాను భిన్నంగా ఉన్న విషయం ఎమిలీకి తెలుసని తల్లి టామ్ డోవర్ పేర్కొన్నారు. నిరంతర నొప్పి, చురుకుదనం లోపించడంతో ఫిజియోథెరపీ సెషన్లలో వారాంతాల్లో పాల్గొనాల్సి ఉంది. హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేస్తే మోనోపాజ్ దశకు చేరుకోనుంది. అంటే దాదాపు 50 ఏళ్ల మహిళలకు ఎదురయ్యే దుష్ప్రభావాలు మోనోపాజ్తో చిన్నారికి వచ్చే అవకాశం ఉంది.

చిన్నతనంలో అనుభవించాల్సిన బాల్యాన్ని ఎమిలీ కోల్పోయిందని తల్లి టామ్ డోవర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే రుతుస్రావ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఎమినీ వైద్య సాయానికి భారీగా డబ్బు కావల్సి రావడంతో 'గోఫండ్మీ'లో విరాళాల కోసం ఓ పేజీని క్రియేట్ చేశారు.

మరిన్ని వార్తలు