నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కన్నుమూత

14 Jul, 2017 09:55 IST|Sakshi
నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కన్నుమూత

కమ్యునిస్టు గడ్డపై ప్రజాస్వామ్యం కోసం శాంతియుతంగా పోరాడిన కిరణం నేలరాలింది. ప్రజలకు ప్రజాస్వామ్య ఫలాలు అందాలని చైనా కమ్యునిస్టు ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచిన ధీశాలి ఇకలేరు. ప్రపంచం ఆయన్ను నోబెల్ శాంతి పురస్కారంతో సత్కరించినా, చైనా ప్రభుత్వం మాత్రం కారాగారంలో పెట్టింది. అయినా వెనక్కు తగ్గకుండా ప్రజల ఆకాంక్ష కోసం కరుడుగట్టిన కమ్యునిస్టు భావాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అస్తమించారు.

బీజింగ్ :
చైనాకు చెందిన ప్రముఖ నోబెల్ శాంతి పురస్కార గ్రహీత లియూ జియాబావో(61) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. జైలు శిక్ష అనుభవిస్తున్న లియూ జియాబావోను ఈ మధ్యకాలంలోనే పెరోల్‌పై చైనా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజాస్వామ్య సంస్కరణల పేరిట ప్రభుత్వ కూల్చివేతకు కుట్రపన్నారన్న కారణంతో ఆయనకు 2009లో జైలుశిక్ష విధించింది.

ఈ కేసుకు సంబంధించి అనూహ్యంగా 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఆయన నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. అయితే లియూ జైలులో ఉండటంతో అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఖాళీ కుర్చీని ఏర్పాటు చేసి నోబెల్ అందజేశారు. జైలులో ఉండగానే జియాబావో లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. అయితే ఇతర మెరుగైన చికిత్సకోసం విదేశాలకు పంపించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరిస్తూ కఠినంగా వ్యవహరించింది. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి రావడంతో అప్పుడప్పుడు జర్మనీ, అమెరికా దేశాల నుంచి ప్రత్యేక అనుమతితో వైద్యులను రప్పించి చికిత్స చేయించారు. అయినప్పటికీ క్యాన్సర్ తీవ్రత అధికమై అవయవాలు పనిచేయకపోవడంతో శరీరం చికిత్సకు సహకరించక అయన కన్నుమూశారు. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు