సైనికుడి ముఖం నుంచి గ్రనేడ్ తొలగించిన వైద్యులు!

11 Jun, 2016 17:56 IST|Sakshi
సైనికుడి ముఖం నుంచి గ్రనేడ్ తొలగించిన వైద్యులు!

అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఓ సైనికుడి ముఖంలోకి లైవ్ గ్రనేడ్ చొచ్చుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు తక్షణ వైద్యం అందించి  అతడ్ని ప్రాణాలతో కాపాడటంతోపాటు, ముఖంలోకి  చొచ్చుకు పోయిన లైవ్ గ్రనేడ్‌ను విజయవంతంగా బయటకు తీశారు. బాధితుడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా గ్రనేడ్‌ను ముఖం నుంచి తొలగించి సఫలమయ్యారు.

ఇందుకోసం కొలంబియా సర్జన్లు  గంటల తరబడి కష్టపడ్డారు. ఆపరేషన్ కోసం సంఘటన స్థలం నుంచీ సైనికుడిని బొగోటా మిలటరీ ఆస్పత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. ఇలా తరలించేందుకు దాదాపు 8 గంటల సమయం పట్టింది. అత్యవసర పరిస్థితుల్లో  హెలికాప్టర్ ద్వారా తరలించాల్సిన బాధితుడిని, అతడి ముఖంలో ఉన్న గ్రనేడ్ పేలే ప్రమాదం ఉండటంతో ఆలస్యం అయినా రోడ్డు మార్గంలోనే తరలించాల్సి వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు.

ప్రమాద పరిస్థితుల్లో అప్రమత్తమై అత్యవసర చికిత్స అందించాల్సి ఉండగా... అతడి పరిస్థితిని బట్టి అలా జరగలేదని, ఆస్పత్రి సర్జన్ల సూచనల మేరకు వైద్యులంతా కష్టపడి ఆపరేషన్ చేయడంతో పేషెంట్ కోలుకున్నాడని ఆస్పత్రి చీఫ్ సర్జన్ ఓ ప్రకటనలో తెలిపారు. సదరు సైనికుడు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు లాంచర్ యాక్టివేట్ అవ్వడంతో గ్రనేడ్ అతడి కుడి దవడలోకి దూసుకుపోయిందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు