కారు సీట్లకు పందులను కట్టేసి...

31 Oct, 2019 17:24 IST|Sakshi

న్యూఢిల్లీ : చైనాలోని కార్ల కంపెనీలు సజీవ పందులను నిజంగా ‘గినీ పిగ్స్‌’గా ఉపయోగిస్తున్నాయి. పిల్లల సీటు బెల్టుల పటిష్టతను పరీక్షించేందుకు జరిపే ప్రయాగాలలో వీటిని వాడుతున్నాయి. కార్ల సీట్లలో పందులను సజీవంగా బెల్ట్‌లతో కట్టేసి గంటకు 30, 40 కిలోమీటర్ల వేగంతో గోడలకు ఢీ కొట్టిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పందుల ఎముకలు విరగడమే కాకుండా వాటి లోపల అంతర్గతంగా గాయాలవుతున్నాయని, వాటి నుంచి రక్తస్రావం అవుతోందని, ఆ బాధను భరించలేక అవి వాంతులు చేసుకుంటున్నాయని, కొన్ని చనిపోతున్నాయని జంతు కారుణ్య కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఇలా చైనాలో ఓ కార్ల కంపెనీ 15 పందులపై ఈ ప్రయోగాలు నిర్వహించగా, వాటిలో ఏడు పందులు చనిపోయాయని జంతు కారుణ్య కార్యకర్తల అధికార ప్రతినిధి అన్నే మైనర్ట్‌ తెలిపినట్లు ‘బిల్డ్‌’ జర్మనీ వార్తా పత్రిక వెల్లడించింది. ప్రయోగాలకు ముందు కొన్ని గంటల నుంచి ఆ పందులకు తిండి, నీళ్లు కూడా ఇవ్వకుండా కూడా వేధిస్తున్నారని అన్నే మైనర్ట్‌ తెలిపారు. పందులు, చిన్న పిల్లల శరీర నిర్మాణం ఒకేలాగా ఉంటుంది కనుక కార్ల కంపెనీలు ఎక్కువగా పందులపై ప్రయోగాలు జరపుతున్నాయని తెల్సింది. అమెరికాలో జనరల్‌ మోటార్స్‌ కంపెనీ 1990 దశకం వరకు పందులతో ఇలాంటి ప్రయోగాలే నిర్వహించేది. జంతు కారుణ్య కార్యకర్తల ఆందోళనతో మానేసింది.

మరిన్ని వార్తలు