పెళ్లయిన జంటల్లో ‘ఎల్‌ఏటీ’ ట్రెండ్‌

8 Jan, 2020 19:01 IST|Sakshi

‘ఎల్‌ఏటీ’  అంటే లివింగ్‌ ఏ పార్ట్‌ టుగెదర్‌. భార్యాభర్తలు దూరదూరంగా ఉంటూ కలిసి ఉండడం. ఇప్పుడు ఇది పలు దేశాల్లో కొత్త ట్రెండ్‌గా మారింది. ఇంగ్లండ్‌లో 25 శాతం జంటలు, ముఖ్యంగా యవ్వనంలో ఉన్న జంటలు ఎక్కువగా వేర్వేరు ఇళ్లలో స్వతంత్రంగా ఉంటున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. అలా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటూ స్నేహితుల్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ కాపురాలు చేస్తున్నారట. దాని వల్ల వారి మధ్య మొహం మొత్తకుండా ఒకరి పట్ల ఒకరికి ఎప్పటికప్పుడు కొత్త ప్రేమ చిగురిస్తోందట! మరి అలాంటి జంటలు పిల్లలు పుడితే ఏం చేస్తాయో తెలియదు.

భార్యా భర్తలు ఎప్పుడూ కలసి ఉండడం వల్ల ఒకరి అలవాట్లు ఒకరికి పడక, తరచూ గొడవ పడుతుండడం అందరికి తెల్సిందే. వారు విడి విడిగా ఉండడం వల్ల ఎవరి స్వతంత్య్రం వారికి ఉండడంతోపాటు ఎవరి ఉద్యోగాలు వారు సక్రమంగా చేసుకోగలుగుతున్నారట. అప్పుడప్పుడు ఒంటరితనం ఫీలనప్పుడు స్నేహితుల్లా కలుసుకోవడం చాలా, చాలా బాగుండడమే కాకుండా జీవితానికి కొత్త స్ఫూర్తినిస్తుందట. ‘యూనివర్శిటీ ఆఫ్‌ బ్రాడ్‌ఫోర్డ్‌’కు చెందిన ప్రొఫెసర్‌ సైమన్‌ డుంకన్‌ ఇలా విడి విడిగా ఉంటూ అప్పుడప్పుడు సహ జీవనం చేస్తున్న 50 జంటలను కలుసుకొని వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా ఈ అధ్యయనం జరిపారు. 

యువతీ యువకుల్లో ప్రతి ఒక్కరు తమకంటూ ఓ సొంత స్పేస్‌ను కోరుకుంటారని, అది లభించడం వల్ల వారి మనుసు కుదట పడడమే కాకుండా దూర, దూరంగా ఉన్న భాగస్వాముల పట్ల తరగని ప్రేమ పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. ఎవరికి వారు విడి విడిగా ఉంటున్నాం కదా! ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా పరస్పర విశ్వాసాలతో సంబంధాలను కొనసాగించడం ఇందులో మరో విశేషం. 

వేర్వేరుగా ఉంటున్న జంటల్లో 43 శాతం మంది 16 నుంచి 24 ఏళ్ల లోపువారు కాగా 45 శాతం మంది 25 నుంచి 54 ఏళ్ల లోపు వయస్సు వారు, కేవలం 11 శాతం మంది మాత్రమే 54 ఏళ్లు పైబడిన వారు ఉంటున్నారు. ఇలా విడి విడిగా ఉంటున్న జంటల్లో విడాకుల సమస్యే రావడం లేదట. అందుకని ఇంగ్లండ్‌ 2017 సంవత్సరంతో పోలిస్తే రెండేళ్లలో విడాకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందట. 

మరిన్ని వార్తలు