ఆమె.. పిల్లి.. ఆరేళ్లుగా సముద్రంలోనే!

30 Apr, 2016 15:14 IST|Sakshi
ఆమె.. పిల్లి.. ఆరేళ్లుగా సముద్రంలోనే!

అమ్మా లేదు, నాన్నాలేడు, అక్కా చెల్లి తంబీలు లేరు. ఉన్నదల్లా ఓ పిల్లి, చిన్న పడవ. ఆ మాత్రం చాలట.. 32 ఏళ్ల అవివాహిత లిజ్ క్లార్క్ కు.. సముద్రయానం చేస్తూ ప్రపంచాన్నిచుట్టిరావడానికి! ఆరేళ్లుగా సముద్రంలోనే జీవిస్తూ.. పిల్లితో కలిసి పడవలో ప్రయాణిస్తున్న కెప్టెన్ లిజ్ జీవితం  ఆద్యంతం ఆసక్తికరం.

శాండియాగో (కాలిఫోర్నియా)లో పుట్టి ప్రస్తుతం సముద్రాన్నే కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్న లిజ్ కు చిన్నప్పుడే ప్రపంచాన్ని చుట్టిరావాలని కలలు కనేది. చదువు పూర్తయ్యాక కలల్ని నిజం చేసుకోవాలని కంకణం కట్టుకుంది. సొంతగా సంపాదించిన డబ్బుతో 1960ల నాటి పాత బోట్ ఒకటి కొనుగోలుచేసింది. ఈ ప్రయత్నాల్లో ఉన్నప్పుడే ఆమెకు ఓ పిల్లి కూన దొరికింది. దానికి అమెలియా అని పేరుపెట్టి తనతోనే ఉంచేసుకుంది లిజ్. జంతు సంరక్షణ అన్నా, పర్యావరణ పరిరక్షణ అన్నా విపరీతమైన ఆసక్తి కనబరుస్తుందామె.

వెళ్లాలనుకుంటే ఏ విమానాల్లోనో వరల్డ్ టూర్ చేయ్యొచ్చు. కానీ పర్యావరణానికి నష్టం కలిగించకుండా జీవించడం ఆమె ఆసక్తి. ప్రపంచాన్ని చుట్టిరావడం కోరిక. రెండింటినీ మిక్స్ చేసి.. 26 ఏళ్ల వయసులో సముద్రయానం మొదలుపెట్టింది. 40 అడుగల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉండే 'వేల్'అనే బోటులోకి అడుగుపెట్టినప్పుడు పిల్లి కూన వయసు ఆరు నెలలు ఇప్పుడు.. ఆరు సంవత్సరాల ఆరు నెలలు.

కాలిఫోర్నియా తీరంలో ప్రారంభమైన లిజ్, అమేలియాల ప్రపంచ యాత్ర.. మెక్సికో దక్షిణ తీరం, మధ్య అమెరికా, ఉత్తర ఫసిఫిక్ ల గుండా సాగిపోతోంది. మధ్యమధ్యలో అందమైన బీచ్ లు కినిపిస్తే ఆగి, ఆమేలియాతో కలిసి విడిది చేస్తుంది లిజ్ క్లార్క్. విశ్రాంతితో ఎనర్జీ గెయిన్ చేసుకుని మళ్లీ 'ఏనావది ఏ తీరమో..'పాట పాడుతూ లంగరు ఎత్తేస్తుంది.

కెప్టెన్ లిజ్ క్లార్క్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన పర్యటన వివరాలను వెల్లడించే ఆమె ఇటీవలే ఒకటినుండే ట్రావెల్ మ్యాగజైన్లకు ఇంటర్వ్యూ ఇచ్చింది. తన పిల్లి చేపల్ని వేటాడటంలో సిద్ధహస్తురాలైందని చెప్పింది. తన దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయిందని, కల నెరవేరాలంటే మరిన్ని డబ్బులు కావాలని, వీలైతే స్పాన్సర్ చెయ్యమని అభ్యర్థించింది. తన కలని నెరవేర్చుకోవడంలో ఆమెకు కిక్కుదొరికింది. సాటి మనిషి కలను నెరవేర్చడంలో కిక్కుందని భావిస్తే వయా సోషల్ మీడియా మీరూ ఆమెను సంప్రదించవచ్చు!

మరిన్ని వార్తలు