ఇటలీ తరహాలో భారత్‌లో లాక్‌డౌన్‌!

30 Apr, 2020 18:12 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఇటలీ మార్చి పదవ తేదీన దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. యూరప్‌లో అన్ని దేశాలకన్నా ముందుగా లాక్‌డౌన్‌ ప్రకటించిన దేశం ఇటలీనే. ఇటలీలో తొలి కరోనా కేసు ఫిబ్రవరి 20వ తేదీన వెలుగులోకి రాగా, లాక్‌డౌన్‌ ప్రకటించిన మార్చి 10వ తేదీకి మధ్య 20 రోజుల వ్యవధి ఉండింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న మూడవ దేశంగా, కరోనా మరణాల్లో అమెరికా తర్వాత రెండో దేశంగా ఇటలీ వార్తల్లో ఎక్కడంతో ‘లాక్‌డౌన్‌’ను ప్రకటించడంలో ప్రధాన మంత్రి గిసెప్పీ కాంటే ఆలస్యం చేశారని ప్రతిప్రక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆ మాటకొస్తే భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30వ తేదీన బయట పడగా, మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ‘లాక్‌డౌన్‌’ ప్రకటించింది. ఈ విషయంలో ఇటలీ 20 రోజుల్లో స్పందించగా, భారత్‌ 53 రోజులకు స్పందించింది. కాకపోతే ఇటలీతో పోలీస్తే భారత్‌లో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. భారత్‌లోలాగానే మే 3వ తేదీన ఇటలీ లాక్‌డౌన్‌ ముగుస్తుంది. ‘మొదటి దశ కింద లాక్‌డౌన్‌తో బతకడం, రెండో దశలో వైరస్‌తో పాటు కలసి బతకడం’ అనేది తమ వ్యూహంగా ఇటలీ ప్రధాని గిసెప్పీ మార్చి9వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

అయితే మే నాలుగవ తేదీన లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయమని, రోజువారి సడలింపులతో క్రమంగా ఎత్తివేస్తామని ఆయన ప్రకటించారు. మే నాలుగవ తేదీన ప్రజలు తమ మున్సిపాలిటీ పరిధులు దాటి సెల్ప్‌ డిక్లరేషన్‌ ద్వారా ఇతర ప్రాంతాల్లో ప్రయాణించవచ్చు. ప్రజల వ్యాయామం కోసం పార్కులు, గార్డెన్లు తెరుస్తారు. సన్‌బాతింగ్, క్రీడలను అనుమతించరు. బార్లు, రెస్టారెంట్లు ఆన్‌లైన్‌ ద్వారానే అమ్మకాలు జరపాలి. అంత్యక్రియలకు 15 మందికి మించి హాజరుకారాదు. అతి తక్కువ మందితో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను అనుమతిస్తారు. మే 18వ తేదీ నుంచి రిటైల్‌ షాపింగ్, మ్యూజియంలు, లైబ్రరీలు, సాంస్కృతిక కేంద్రాలను తెరుస్తారు. జూన్‌ ఒకటవ తేదీ నుంచి బార్లు, రెస్టారెంట్లు, హేర్‌ డ్రెసర్స్, వెల్‌నెస్‌ సెంటర్లు తెరుస్తారు. అయితే ప్రజలు అన్ని వేళల, అన్ని చోట్ల మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం షరతులు విధించింది. సెప్టెంబర్‌ నెల నుంచి విద్యా సంస్థలను తెరవాలని, నైట్‌క్లబ్బులను, సినిమా హాళ్లను, మత కార్యక్రమాలను అనుమతించాలని నిర్ణయించింది. (భారత్‌లో పంజా విసురుతున్న కరోనా)

లాక్‌డౌన్‌ కారణంగా ఇటలీ జీడీపీ రేటు 8 శాతం పడిపోతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేసిన నేపథ్యంలో ప్రతిపక్షంతోపాటు పలు పక్షాలు విమర్శిస్తున్నప్పటికీ ఇలా క్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ఇటలీ ప్రధాని నిర్ణయించారు. భారత్‌లో లాక్‌డౌన్‌ వల్ల జీడీపీ ఏడు శాతం పడిపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్‌ కూడా ఇటలీ తరహాలో లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేయవచ్చని వివిధ సామాజిక, రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌ లాక్‌డౌన్‌ మే 3వ తేదీన ముగిసిపోనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కరోనా కాటు: దారిద్య్రంలోకి 10 కోట్ల మంది

మరిన్ని వార్తలు