వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌లు సరిపోవు: డబ్య్లూహెచ్‌వో

23 Mar, 2020 08:35 IST|Sakshi
డాక్టర్ మైక్ ర్యాన్

జెనీవా : కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వరుసగా పెరగుతున్న పాజిటివ్  కేసులతో భారతదేశం గజగజలాడుతోంది. ఈక్రమంలో దేశంలోని అన్నిరాష్ట్రాలు ఇప్పటికే సత్వర చర్యలకు దిగాయి. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. తద్వారా అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈప్రాణాంతక వ్యాధి విస్తరణను అడ్డుకోవాలనేది ప్రధాన లక్ష్యం. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌వో) నిపుణుడు మైక్‌ ర్యాన్‌  కొన్ని కీలక విషయాలను ప్రకటించారు. వైరస్ నిరోధానికి కేవలం లాక్‌డౌన్‌లు ఎంత మాత్రం చాలవని పేర్కొన్నారు. వైరస్‌ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే కరోనా బాధిత దేశాలు వైరస్‌ సోకిన వాళ్లను కనిపెట్టి వాళ్లను ఐసోలేషన్‌ వార్డుకు తరలించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆయా దేశాలు చేపట్టే కట్టుదిట్టమైన ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు. (ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. కరోనాకు విరుగుడు..!)

ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర నిపుణుడు డాక్టర్ మైక్ ర్యాన్ బీబీసీ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. ‘అనారోగ్యంతో ఉన్నవారిని, వైరస్ ఉన్నవారిని కనుగొనడం, వారిని వేరుచేయడం, వారి పరిచయాలను కనుగొని వారిని వేరుచేయడం పై నిజంగా దృష్టి పెట్టాలి. లాక్ డౌన్లతో ప్రస్తుతం ప్రమాదం.. లాక్‌డౌన్లు విధించినంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేం. బలమైన ప్రజారోగ్య సంరక్షణ చర్యలు బలంగా లేకపోతే లాక్‌డౌన్లు ఎత్తివేసినప్పుడు, ప్రమాదం ముదిరి వ్యాధి తిరిగి మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది.

చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు వైరస్‌ బాధితులను వేగంగా గుర్తించిడంతో పాటు, కఠినమైన చర్యలతో వ్యాధిని కట్టడిచేశాయి. ఆ దేశాలను మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైరస్ పై పోరుకు తీవ్రమైన ఆంక్షలను ప్రవేశపెట్టాయి.  వర్క్  ఫ్రం హోం, పాఠశాలలు, బార్లు, పబ్బులు , రెస్టారెంట్లు మూసివేత లాంటిచర్యలు  చేపట్టాయి. త్వరలోనే ఈ వైరస్‌కు టీకా వస్తుందని ఆశిస్తున్నాం. కానీ తక్షణం దీన్నుంచి బయటపడేందుకు ఇప్పుడు చేయవలసినది చేయాలి.  ప్రజలు బాధ్యతగా జాగ్రత్తలు పాటించడం చాలా కీలకం’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు