ఎలక్ట్రికల్ బస్సులతో కాలుష్యానికి చెక్

17 Dec, 2015 19:23 IST|Sakshi
ఎలక్ట్రికల్ బస్సులతో కాలుష్యానికి చెక్

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టనున్న కార్యక్రమాల్లో మరో అడుగు ముందుకు పడనుంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్న హస్తినను కాపాడటంలో భాగంగా ఇప్పటికే నెంబర్ ప్లేట్ల విధానం అమల్లోకి రాగా... ప్రస్తుతం బ్యాటరీ విద్యుత్ ఆధారిత బస్సులను ప్రవేశ పెట్టే యోచనలో మోడీ ప్రభుత్వం ఉంది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే డిసెంబర్ 21న మంత్రులకు రెండు ఎలక్ట్రికల్ బస్సులు అందించనున్నట్లు తెలుస్తోంది.  ఈ బస్సులకు లిథియం, అయాన్ కలయికల తో తయారయ్యే బ్యాటరీలను ఇస్రో అందించనుంది.

రోజురోజుకూ  పెరిగిపోతున్నకాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం బ్యాటరీ విద్యుత్ ఆధారిత బస్సులను ప్రవేశపెట్టనుంది. ముందుగా దేశ రాజధానిలో 15 బస్సులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ విద్యుత్ బస్సులకు వినియోగించే బ్యాటరీలను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటే సుమారు 55 లక్షల రూపాయలు ఖర్చవుతుండగా... వీటిని ఇస్రో కేవలం 5 లక్షల రూపాయలకే అందించనుంది. ఇస్రోలో పవర్ శాటిలెట్లకు ఇవే బ్యాటరీలను వినియోగిస్తుంటారు. ఈ బ్యాటరీలు చవగ్గా దొరకడంవల్ల పొదుపుతోపాటు, వీటిని తిరిగి వాడుకునేందుకు వీలవ్వడం ఓ విశేషం. ఈ పైలట్ ప్రాజెక్టులో మంత్రులకు ఇచ్చే  రెండు బస్సులతోపాటు మొత్తం 15 బస్సులు ఢిల్లీ రోడ్లపైకి ఎక్కే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 1.5 లక్షల డీజిల్ బస్సులకు బదులుగా ఎలక్ట్రికల్ బస్సులను నడపాలన్న యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ద్వారా దేశంలో  మొత్తం 1.5 లక్షల డీజిల్ బస్సులు ప్రస్తుతం నడుస్తున్నాయని, వాటి స్థానంలో ఇస్రో సాంకేతిక సహకారం అందించే బ్యాటరీ విద్యుత్ ఆధారిత బస్సులు నడిపేందుకు యోచిస్తున్నామని, రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. వీటి ద్వారా సుమారు 8 లక్షల కోట్ల రూపాయల బిల్లు తగ్గుతుందని  పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శుభ్రతతోపాటు, ఖర్చును తగ్గించే ఈ ప్రయత్నం, ప్రత్యామ్నాయ ఇంధన వాడకానికి మార్గమౌతుందని అన్నారు. ఢిల్లీలో పొగమంచులా కప్పుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు భవిష్యత్తులో ఈ ప్రయత్నం సహకరిస్తుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు