కరోనా చికిత్సకు కొత్త పరికరం

30 Mar, 2020 14:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారిని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేర్చకుండా వారి ఊపిరితిత్తులకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించేందుకు మెర్సిడెస్‌ ఫార్ములా వన్‌ ఇంజనీర్ల సహకారంతో యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందిన పరిశోధకులు ఓ కొత్త పరికరాన్ని కనుగొన్నారు. కంటిన్యుయస్‌ పాసిటీవ్‌ ఏర్‌వే ప్రెషర్‌ (సీపీఏపీ)’ గా నామకరణం చేసిన ఈ పరికరాన్ని నాలుగు రోజులు శ్రమించి కనుక్కోవడం విశేషం. ప్రస్తుతం దీని పని విధానాన్ని లండన్‌ ఉత్తరాది ఆస్పత్రుల్లో పరీక్షించి చూస్తున్నారు. కరోనా బాధితుల ఊపిరితిత్తులను ప్రభావితం చేయడం కోసం పేషంట్‌ ధరించిన మాస్క్‌లోకి ఈ పరికరం ఆక్సిజన్‌ను గాలిని పంపిస్తుందని పరిశోధకులు తెలిపారు. వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ఈ పరికరాలను ఉపయోగించవచ్చని, ప్రస్తుతం వెంటిలేటర్లు కొరత కారణంగా ఇటలీ వైద్యులు ఇలాంటి టెక్నిక్‌నే ఉపయోగిస్తున్నారు. ( కరోనా : మద్యం షాపులు బంద్‌ చేయటంతో..  )

అలాంటి టెక్నితోనే తయారు చేసిన తమ పరికరాల ట్రయల్స్‌ ఈ వారంతో ముగిసిపోతాయని, వైద్య పరికరాల భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించే ‘ఎంహెచ్‌ఆర్‌ఏ’ అనుమతి ఇచ్చినందున త్వరలోనే ఈ పరికరాలు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు తెలిపారు. లండన్‌లోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత ఏర్పడడంతో బ్రతికే అవకాశం ఉన్న రోగులను మాత్రమే చేర్చుకుంటామని వైద్యులు షరతు విధించడంతో ప్రత్యామ్నాయ వెంటిలేటర్ల కోసం తాము కృషి చేయాల్సి వచ్చిందని వారు చెప్పారు. ఈ పరికరాలను తాము రోజుకు వంద చొప్పున తయారు చేయగలమని ఎన్‌హెచ్‌ఎస్‌ తెలియజేయగా, ముందస్తు సమాచారం ఉంటే తాము రోజుకు వెయ్యి వెంటిలేటర్లను తయారు చేసి ఇవ్వగలమని ఫార్ములా వన్‌ ఇంజనీర్లు తెలిపారు. లండన్‌లో కరోనా బాధితుల సంఖ్య 20వేలకు చేరిందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తుండగా, దేశంలో దాదాపు 16 లక్షల మంది కరోనా సోకి ఉండవచ్చని హెల్త్‌కేర్‌ డేటా కంపెనీ అంచనా వేస్తోంది. ( కరోనా బారి నుంచి తప్పించుకుందాం ఇలా..)

మరిన్ని వార్తలు