తోడుగా ఉంటుందని పంపిస్తే.. ప్రాణం తీసింది

9 Feb, 2019 18:47 IST|Sakshi

లండన్‌ : తోడుగా ఉంటుందని భావించి మెలాటిని.. అసిమ్‌కు జతగా పంపించారు. కొన్నాళ్ల పాటు కలిసి ఉంటే అసిమ్‌ ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడుతుందని భావించారు. కానీ 10 రోజులు కూడా గడవకముందే అసిమ్‌, మెలాటిని చంపేసింది. ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం అంటూ బాధపడుతున్నారు అధికారులు. ఎవరైనా చనిపోతే తల్లిదండ్రులు కదా బాధపడాల్సింది.. మరి అధికారులు ఎందుకు బాధపడుతున్నారు అనుకుంటున్నారా.. ఎందుకంటే చనిపోయింది ఓ ఆడపులి కాబట్టి. వివరాలు.. అంతరించి పోతున్న సుమత్రన్‌ జాతుల పులుల సంఖ్యను పెంచడం కోసం అధికారులు లండన్‌ జూకి ఓ అరుదైన సుమత్రన్‌ జాతి పులి అసిమ్‌ను తీసుకొచ్చారు. అసిమ్‌కు ఇక్కడి పరిస్థితులు అలవాటయ్యేదాక.. మెలాటి అనే ఆడపులిని తోడుగా ఉంచి ఆ తర్వాత బ్రీడింగ్‌ కోసం ప్రయత్నిస్తే మంచిదని అధికారులు భావించారు.

ఈ విషయం గురించి జూ అధికారులు మాట్లాడుతూ.. ‘అసిమ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. అందుకే ఎక్స్‌పర్ట్‌లను కూడా నియమించాం. వారు ఈ రెండు పులల కదలికను చాలా జాగ్రత్తగా పరిశీలించేవారు. వచ్చిన తొలినాళ్లలో అసిమ్‌ బాగానే ఉండేది. కానీ పోను పోను.. అది చాలా దూకుడుగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఈ క్రమంలో అసిమ్‌, మెలాటి మీద దాడి చేసింది. అయితే ఘర్షణ పడుతున్న రెండు పులులను విడిపించడానికి మేం చాలా ప్రయత్నించాం. పెద్ద శబ్దాలు చేయడం, మంట పెట్టడం, అలారాలను మోగించడం వంటి పనులు చేశాం. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. ఈ దాడిలో మెలాటి చనిపోయింది. ఇది మేం ఊహించని పరిణామం.. ఇందుకు చాలా బాధపడుతున్నామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు