ఇమ్రాన్‌ రాజీనామా కోరుతూ ఆజాద్‌ ర్యాలీ

2 Nov, 2019 16:09 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పాలనపై వ్యతిరేకత రోజురోజుకూ తీవ్ర తరమవుతోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు  ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌కు.. స్వదేశంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానికి నిరసనగా ఇమ్రాన్‌ ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇమ్రాన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జమైత్‌ ఉలేమా ఇస్లామ్‌ చీఫ్‌ ఫజలర్‌ రెహ్మాన్‌  ‘ఆజాద్‌ మార్చ్‌’ పేరుతో భారీ నిరసన ర్యాలీని ప్రారంభించారు. అక్టోబర్‌ 27న కరాచీలో ప్రారంభమైన ఈ ర్యాలీ శనివారం నాటికి దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరింది. పాక్‌లోని ప్రధాన పార్టీలైన పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌, పాక్‌ పీపుల్స్‌ పార్టీ, అవామీ నేషనల్‌ పార్టీతో పాటు పలు సంఘాలూ ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించాయి. అయితే రెండు రోజుల క్రితమే ఇస్లామాబాద్‌కు చేరాల్సిన ఈ ర్యాలీ.. ప్రజల నుంచి అనుకోని మద్దతు రావడంతో కొంత ఆలస్యమైనట్లు నిర్వహకులు తెలిపారు.

ఇమ్రాన్‌ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఈ సందర్భంగా నేతలు విమర్శించారు. తక్షణమే ఇమ్రాన్‌ తన పదవికి రాజీనామా చేయాలని ఫజలర్‌ రెహ్మాన్‌ డిమాండ్‌ చేశారు. కాగా ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న ఇమ్రాన్‌.. తాజాగా విపక్షాల ర్యాలీతో మరన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. ఉగ్రవాదులకు నిధులు మంజూరు చేస్తున్నారని పలు అంతర్జాతీయ సంస్థలు సైతం పాక్‌ను నిధుల విడుదలను ఆపాయి. దీంతో సరిపడ నిధులు లేక ఇమ్రాన్‌ ప్రభుత్వం అతలాకుతలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ రోజురోజుకూ మరింత బలపడుతోంది. తాజాగా చేపట్టిన ఆజాద్‌ మార్చ్‌ ఇమ్రాన్‌కు ముచ్చమటలు పటిస్తోంది.

మరిన్ని వార్తలు