ఇలా చదివితే కళ్లు పోతాయ్‌!

8 Jun, 2018 08:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌ : అతిగా చదవటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు శాస్త్రవేత్తలు. సంవత్సరాల తరబడి అలా చదవటం వల్ల కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్‌ బ్రిష్టల్‌, కర్డిఫ్‌ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగు చూశాయి. సంవత్సరాల కొద్ది చదువులు చదవటం వల్ల అది నేరుగా కంటిచూపు మీద ప్రభావం చూపుతుందంటున్నారు. వైద్య పరిభాషలో ‘మియోపియా’అని చెప్పబడే కంటి సంబంధ వ్యాధి దాడి చేసే అవకాశం ఉందంటున్నారు. ‘మెండెలియన్ రాండమైజేషన్‌’ పద్ధతి ద్వారా 40-69 మధ్య వయస్సు కలిగిన దాదాపు 68వేల మందితో ఓ సర్వే నిర్వహించారు శాస్త్రవేత్తలు.

‘మియోపియా’ పెరుగుతూపోతే కంటిచూపు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. చదువుకునే సంవత్సరాలు పెరిగే కొద్ది వారిలో కంటిచూపు ప్రతి సంవత్సరానికి 0.27 డియోప్ట్రాస్(రిప్రేక్టివ్‌ ఎర్రర్‌) మేర నష్టపోయినట్లు వెల్లడైంది. ఇంటర్‌తో చదువు ఆపేసిన వారిలో కంటిచూపు కొంత మెరుగ్గా ఉన్నట్లు తేలింది. చదువులు పెరిగే కొద్ది విద్యార్హత పెరగటంతో పాటు కంటిచూపు తగ్గుతుందని గుర్తించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ర్యాంకుల కోసం పిల్లలకు విశ్రాంతి ఇవ్వకుండా చదివించే తల్లిదండ్రులు కొంచెం ఆలోచిస్తే పిల్లలు ‘కళ్ల’కాలం సుఖంగా ఉంటారని మేథావులు సలహా ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు