సెలవు దినాల్లోనూ పని.. కారణమేంటంటే?

9 May, 2018 19:17 IST|Sakshi

ఎక్కువ పనిగంటల వల్లే ముప్పే..

సాక్షి, న్యూఢిల్లీ : ఎంత తక్కువ పని గంటలుండి, అంత ఎక్కువ జీతమిస్తే ఆనందపడే వారు ఎందరుంటారోగానీ తక్కువ పని గంటలుండి ఎక్కువ సెలవులుంటే ఆనంద పడేవారు ఎక్కువే ఉంటారు. ఒకప్పుడు ఫ్యాక్టరీలలో 15, 18 గంటలు పని చేయించుకునేవారు. శారీరకంగా, మానసికంగా అన్ని గంటలు పనిచేయడం కష్టమవడంతో అమెరికాలో మేడే ఉద్యమం ద్వారా అంతర్జాతీయంగా కార్మికులకు 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. రాను, రాను సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందడంతో కొన్ని రంగాల్లో పని దినాలు తగ్గుతూ సెలవు దినాలు పెరుగుతూ వచ్చాయి. కార్మికులు లేదా ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఉత్పత్తి పెరుగుతుందని భావించిన ఐటీ లాంటి కంపెనీలు ఉద్యోగులకు క్రీడల లాంటి అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తూ వచ్చాయి.

రానురాను సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరగడం వల్ల 2030 సంవత్సరానికి పని గంటలు వారానికి 15 గంటలకు చేరుకుంటుందని జాన్‌ మేనర్డ్‌ కీనెస్‌ వంటి ఆర్థిక వేత్తలు ఆశించారు. ఉద్యోగల నుంచి అధిక దిగుబడిని రాబట్టేందుకు పెట్టుబడుదారులు వారి పని గంటలను తగ్గించి, సెలవుదినాలను పెంచుతారని వారు అంచనా వేశారు. ఎందుకంటే తక్కువ పని వల్ల ఉద్యోగులు ఎక్కువ ఆరోగ్యంతో ఉంటారని వారు భావించారు. ఎక్కువ పని గంటల వల్ల ఎక్కువ మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఎక్కువై కార్మికులు అస్వస్థులవడం చూసి వారు అలా భావించారు. ఎక్కువ పని ఒత్తిడి వల్ల అనారోగ్యం పాలవడం నిజమేగానీ తక్కువ పని గంటల వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పలేం. ఆరోగ్యంపై ఇతర సామాజిక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. ఎక్కువ పని గంటల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువేనని కూడా అధ్యయనాల్లో తేలింది.

ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారులు కార్మికుల నుంచి వీలైనంత ఎక్కువ పనిని రాబట్టేందుకే ప్రయత్నిస్తూ వచ్చారు. ఫలితంగా కార్మికులు సెలవుల్లో కూడా పనిచేయడం, అస్వస్థతతో ఉండి కూడా పనిచేయడం ఎక్కువైంది. ఈ అస్వస్థతతో పనిచేసే వారి సంఖ్య 2010 సంవత్సరంలో 26 శాతం ఉండగా, ఇప్పుడు 86 శాతం ఉందని ‘చార్టెట్‌ ఇనిస్టిట్యూడ్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ అనే సంస్థ వెల్లడించింది. ఆశ్చర్యకరంగా సెలవు దినాల్లో పనిచేసేందకు ఎక్కువ మంది సిద్ధపడుతున్నారని, అందుకు పనిపట్ల ఉన్న అంకిత భావం కాదని, సెలవుల్లో కూడా పనిచేస్తున్నారనే గుర్తింపు కోసమని ఈ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. అయితే ఈ మనస్థత్వం ఎక్కువగా మధ్యతరగతి ఉద్యోగుల్లోనే ఉందని తెలిపింది. పని పట్ల అంకిత భావం ఉన్నట్లు కనపడకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో కూడా ఎక్కువ మంది సెలవుల్లో, అనారోగ్యంతో ఉన్నప్పుడు విధులకు హాజరవుతున్నారని తెల్సింది. ఏదేమైనా ఈ పద్ధతి మారక పోతే ఎక్కువ గంటల పని వల్ల అనారోగ్యానికి గురై, మత్యువాత పడక తప్పదని ఆ నివేదిక హెచ్చరించింది.

మరిన్ని వార్తలు