దానిమ్మతో దీర్ఘాయుష్షు!

20 Jul, 2016 03:51 IST|Sakshi
దానిమ్మతో దీర్ఘాయుష్షు!

మీరు రోజూ పండ్లు తింటారా..? అందులో దానిమ్మ పండ్లు ఎక్కువగా ఉంటాయా..? అయితే మీ ఆయుష్షుకు ఢోకా లేదు. ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎక్కువగా తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందని స్విట్జర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానిమ్మ గింజల్లో ఉండే ఓ పరమాణువు కడుపులో ఉండే బ్యాక్టీరియా వల్ల వయోభారంతో వచ్చే సమస్యలను సరిచేసేదిగా మారుతుందని పేర్కొంటున్నారు. ఎలుకలతోపాటు నెమటోడ్ సి.ఎలిగాన్స్ జీవులపై జరిగిన పరిశోధనల్లో ఇప్పటికే రుజువు కాగా, మానవులపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

 వయసు మీద పడుతున్న కొద్దీ మన శరీర కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా బలహీనపడుతుంటాయి. చేయాల్సిన పనులు కూడా చేయలేక పోగుపడుతుంటాయి. దీని ప్రభావం కండరాలు, కణజాలంపై పడి అవి బలహీనమవుతుంటాయి. పార్కిన్‌సన్స్ వ్యాధికి కూడా ఇలా పోగుబడిన మైటోకాండ్రియాలు ఒక కారణం కావచ్చని ఇప్పటికే కొన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఉరోలిథిన్-2 అనే ఓ రసాయనం.. ఈ బలహీనపడ్డ మైటోకాండ్రియాను పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దానిమ్మ గింజల్లో ఉరోలిథిన్-ఏ తయారీకి అవసరమైన పరమాణువులు ఉంటాయని, పేగుల్లోని బ్యాక్టీరియా సాయంతో దీన్ని తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు.

8 నుంచి 10 రోజులు మాత్రమే జీవించే నెమటోడ్‌లపై దీన్ని ప్రయోగించినప్పుడు వాటి ఆయువు దాదాపు 45 శాతం వరకు ఎక్కువైంది. ఎలుకల్లో కూడా 42 శాతం వృద్ధి కనిపించడంతో పాటు అవి మరింత చురుగ్గా కదులుతున్నట్లు గుర్తించారు. తగిన బ్యాక్టీరియా లేకపోతే కొంతమంది ఎన్ని దానిమ్మ పండ్లు తిన్నా ఫలితం ఉండకపోవచ్చునని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అమేజెనిటిస్ అనే కంపెనీ ముందుకొచ్చింది. ఉరోలిథిన్-ఏను నేరుగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఇది యూరప్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో ప్రయోగాలు చేపడుతోంది. ఈ పరిశోధన తాలూకూ వివరాలు నేచర్ మెడిసిన్ మేగజీన్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు