సెప్టిక్‌ ట్యాంక్‌లో పడ్డ 13 గంటలకు....

3 Apr, 2018 15:16 IST|Sakshi

లాస్‌ ఏంజిల్స్‌ : అదృష్టం బావుండి సెప్టిక్‌ ట్యాంక్‌లో పడ్డ 13 గంటల తర్వాత ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సమన్వయంతో వ్యవహరించిన అధికారులు ఓ మ్యాన్‌ హోల్‌ నుంచి అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. లాస్‌ ఏంజిల్స్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఈస్టర్‌ సందర్భంగా ఆదివారం సాయంత్రం జెస్సె హెర్నాండేజ్‌(13) కుటుంబం గ్రిఫ్ఫిత్‌ పార్క్‌లో విహారయాత్రకు వెళ్లారు. జెస్సె తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అంతలో రిపేర్‌లో ఉన్న ఓ మ్యాన్‌ హోల్‌పై ఎక్కి ఆడుకుంటుండగా.. దానిపై ఉన్న చెక్క తలుపు విరిగి 25 అడుగుల లోతైన కాలువలో పడి కొట్టుకుపోయాడు. వెంటనే పిల్లలు అక్కడే ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు 911 కు ఫోన్‌ కాల్‌ చేయటంతో సహయక సిబ్బంది రంగంలోకి దిగారు. 

ఆ కాలువ కాస్త దూరం వెళ్లాక పైప్‌ లైన్‌తో అనుసంధానం అయి.. దగ్గర్లోని నదిలో మురుగు నీరు కలిసే ఏర్పాటు ఉంది. దీంతో ఆలస్యం చేయకుండా నీటి గుండా కెమెరాలను పంపి పిల్లాడి కోసం సెర్చ్‌ఆపరేషన్ చేపట్టారు‌. సుమారు 12 గంటల తర్వాత పైప్‌ లైన్‌లోని ఓ చోట పైభాగంలో పిల్లాడి చేతి గుర్తులు కనిపించాయి. దీంతో ఆ గుర్తులు ఉన్న దగ్గర్లోని మ్యాన్‌ హోల్‌ వద్దకు మూత తొలగించారు. లోపలి నుంచి ‘సాయం చేయాలంటూ’ కేకలు వినిపించాయి. వెంటనే అధికారులు ఓ పైపును లోపలికి పంపి దాని అతన్ని బయటకు లాగారు. నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పిల్లాడు సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ మరి కొన్ని గంటలు అతను అలానే ఉండి ఉంటే ఆ విష పూరిత వాయువులకు జెస్సె ప్రాణాలు గాల్లో కలిసి ఉండేవని రక్షణ సిబ్బంది వెల్లడించారు.  

మరిన్ని వార్తలు