75ఏళ్ల తర్వాత ఒక్కటైన ప్రేమజంట

13 Jun, 2019 12:54 IST|Sakshi

పారిస్‌ : యుద్ధం.. జాతి కోసం మనిషితో మనిషి చేసే పోరాటం.. ప్రేమ ఓ మానిసిక యుద్ధం.. మనసుతో మనిషి చేసే పోరాటం. ఈ రెండు అతడి జీవితంలో భాగమే. యుద్ధమే ఆమెను అతడికి పరిచయం చేసింది. చివరకు ఆ యుద్ధమే వారి మధ్య ఎడబాటుకు కారణమైంది. దాదాపు 75ఏళ్ల సుధీర్ఘమైన ఎడబాటు తర్వాత తన ప్రేయసిని కలుసుకున్న అతడి ఆనందం మాటల్లో చెప్పలేనిది... వివరాల్లోకి వెళితే.. కేటీ రాబిన్స్‌ అనే అమెరికన్‌ సైనికుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జెన్నీ పియర్సన్‌ అనే ఫ్రెంచి అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రెండు నెలల తర్వాత ఆక్సిస్‌ ఫ్రంట్‌తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విషయమే ఆమెకు చెప్పి వీలుంటే తీసుకెళ్లటానికి మళ్లీ వస్తానని అక్కడినుంచి సెలవు తీసుకున్నాడు. రాబిన్స్‌ తిరిగొస్తాడనే నమ్మకంతో జెన్నీ కొద్దికొద్దిగా అతడికోసం ఇంగ్లీషు నేర్చుకోవటం ప్రారంభించింది. 

కానీ యుద్ధం ముగిసినా కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత లిల్లియాన్‌ అనే యువతితో పరిచయం ఏర్పడటం, పెళ్లి జరిగిపోవటం సంభవించింది. అమె కూడా మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయినా ఒకరినొకరు మరిచిపోలేకపోయారు. ఆమె ఫొటో, ఆ గ్రామం పేరు ఆధారంగా జెన్నీ కోసం అన్వేషించాడు. ఎట్టకేలకు అతడి ప్రయత్నం ఫలించి జెన్నీని కలుసుకోగలిగాడు. అన్ని సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నపుడు వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. రాబిన్స్‌ మాట్లాడుతూ.. నేను ప్రతిక్షణం నిన్ను ఆరాధించాను. నువ్వెప్పుడూ నా గుండెల్లోనే ఉన్నావ’ని జెన్నీతో చెప్పాడు. అతడు అపురూపంగా దాచుకున్న ఫొటోను జెన్నీకి చూపించగానే ఆమె ఆశ్చర్యానికి గురైంది.

మరిన్ని వార్తలు