అక్కడ అందరికీ అప్పులే..

30 Mar, 2018 11:15 IST|Sakshi

లండన్‌ : సంపన్న దేశం అనగానే అందరికీ కళ్లుచెదిరే భవంతులు, ఖరీదైన కార్లు గుర్తొస్తుంటాయి. అయితే ఇవన్నీ ఉన్నా బ్రిటన్‌లో ప్రజలందరూ నిండా అప్పుల్లో మునిగారు. పదేళ్ల పాటు అతితక్కువ వడ్డీరేట్లు కొనసాగిన క్రమంలో ప్రజల్లో పొదుపు రేట్లు పడిపోయి రుణాలు పెరిగిపోయాయి. ప్రజలు పొదుపు చేసిన మొత్తం కన్నా తీసుకున్న రుణాలు పెరిగిపోవడంతో 1987 తర్వాత తొలిసారిగా బ్రిటన్‌ ప్రజలు 2017లో నికర రుణగ్రహీతలుగా మారారు. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన డేటాతో ఈ దిగ్భ్రాంతికర సమాచారం వెలుగులోకి వచ్చింది. రాబోయే రోజుల కోసం ప్రజలు పొదుపు చేసే మొత్తాలు 1963 తర్వాత అత్యంత కనిష్టస్ధాయికి పడిపోయాయని నివేదిక వెల్లడించింది.

గత ఏడాది బ్రిటన్‌ పౌరులు తాము సంపాదించిన మొత్తం కంటే 1440 కోట్ల యూరోలు అధికంగా ఖర్చు చేశారు. బ్రిటన్‌ కుటుంబాలు తాము పొదుపు చేసిన మొత్తం కంటే 460 కోట్ల యూరోలు అధికంగా అప్పు చేశారని నివేదిక తెలిపింది. 1963లో పొదుపు వివరాలు మదింపు చేస్తున్నప్పటి నుంచి అతితక్కువగా 2017లో బ్రిటన్‌ పౌరుల సంపాదనలో కేవలం 4.9 శాతమే పొదుపు చేశారని వెల్లడించింది. ఆర్థిక సంక్షోభానికి ముందు వడ్డీరేట్లు 5 శాతం ఉండగా, అనంతరం వడ్డీరేట్లు గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ బేస్‌ రేట్‌ కేవలం 0.5 శాతమే. కారుచౌకగా రుణాలు లభిస్తుండటంతో బ్రిటన్‌ పౌరులు విపరీతంగా రుణాలు తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. వీటిని తిరిగి చెల్లించే క్రమంలో కుటుంబ ఖర్చులను అధిగమించి పొదుపు చేయడం బ్రిటన్‌ పౌరులకు సంక్లిష్టంగా మారింది. మారుతున్న పరిస్థితుల్లో బ్రిటన్‌ పౌరులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొదుపు దేశంగా వర్థిల్లిన బ్రిటన్‌ ఇప్పుడు రుణ గ‍్రహీతల దేశంగా మారిందని ప్రజలు తిరిగి పొదుపును అలవర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు