ఊపిరితిత్తుల్లో కరోనా లక్ష్యాలివి

9 Apr, 2020 04:49 IST|Sakshi

బెర్లిన్‌: కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లో ఏయే కణాలపై దాడులు చేస్తుందో గుర్తించారు జర్మనీలోని బెర్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు. ఈఎంబీవో జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమైన ఈ పరిశోధన .. కోవిడ్‌కు సమర్థమైన చికిత్సను అభివృద్ధి చేసేందుకు సాయపడుతుందని అంచనా. శ్వాసకోశ నాళంలోని ప్రొజెనిటర్‌ కణాలపై కరోనా వైరస్‌లోని రిసెప్టర్‌ దాడి చేస్తున్నట్లు తాము గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రొజెనిటర్‌ కణాల పైభాగంలో ఉండే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు బ్యాక్టీరియాతోపాటు కఫం ఊపిరితిత్తుల నుంచి బయటకు వచ్చేందుకు దోహదపడతాయి.

హైడల్‌బర్గ్‌ లంగ్‌ బయో బ్యాంక్‌ నుంచి సేకరించిన 12 మంది ఊపిరితిత్తుల కేన్సర్‌ రోగుల నమూనాలతో తాము పరిశోధనలు చేశామని, అంతేకాకుండా ఆరోగ్యవంతుల శ్వాసకోశంలో ఉండే కణాలను కూడా పరిశీలించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సేకరించిన సమాచారాన్ని బట్టి చూస్తే కరోనా లేని వ్యక్తుల నుంచి కీలకమై సమాచారం లభిస్తోందని రోలాండ్‌ ఇలిస్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. వైరస్‌పై ఉండే కొమ్ము కణ ఉపరితలంపైని ఏస్‌ రిసెప్టర్లకు అతుక్కుంటున్నట్లు ఇప్పటికే తెలిసినా.. కణాల్లోకి చొరపడేందుకు ఇదొక్కటే సరిపోదని చెప్పారు. సుమారు 60 వేల కణాల జన్యుక్రమాలను పరిశీలించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్రొజెనిటర్‌ కణాలు కరోనా వైరస్‌ అతుక్కోగల రిసెప్టర్ల తయారీకి కీలకమని గుర్తించామని వివరించారు.

మరిన్ని వార్తలు