లగేరహో లక్సెంబర్గ్‌

10 Mar, 2020 05:06 IST|Sakshi

ప్రజలందరికీ ఉచిత రవాణా

రద్దీకి చెక్‌ పెట్టడమే లక్ష్యం

ప్రతి పౌరుడిపై 600 యూరోలు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం

యూరోపియన్‌ యూనియన్‌లోని లక్సెంబర్గ్‌ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజారవాణా వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు సరికొత్త మార్గానికి లగ్జెంబర్గ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బస్సులు, ట్రామ్‌లు, రైళ్లు ఈ మూడింటిలో ఏ రవాణామార్గాన్ని ఎంచుకున్నప్పటికీ అందులో మీరు హాయిగా పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేసేయొచ్చు. ప్రజలందరికీ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. యావత్‌ ప్రజారవాణా వ్యవస్థని నిజంగానే ప్రజలకు అంకితమిచ్చింది. ఒకరోజో, రెండ్రోజులో కాదుసుమండీ. లక్సెంబర్గ్‌లో ప్రజలందరికీ ఇక ప్రయాణం ప్రతిరోజూ ఉచితమే. యూరప్‌లోని అతిచిన్న దేశమైన లక్సెంబర్గ్‌ జనాభా కేవలం 6,14,000. జనాభా గత 20 ఏళ్లలో 40 శాతం పెరిగింది. దీంతో విపరీతంగా పెరిగిన రద్దీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది.

రద్దీని తగ్గించేందుకే..
ప్రపంచ ప్రజల ముందున్న ప్రధానమైన సవాళ్ళలో ట్రాఫిక్, పర్యావరణ సమస్యలు అత్యంత కీలకమైనవి. పర్యావరణం, రద్దీ (ట్రాఫిక్‌ సమస్య) ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్న సమస్యలు కూడా. ఇక లక్సెంబర్గ్‌ సంగతి సరేసరి. విపరీతమైన ట్రాఫిక్‌ సమస్య. ప్రధాన రోడ్లన్నీ పాడైపోయాయి. బస్సులు పాతబడిపోయాయి. రైళ్ళ రాకపోకలు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వం విమర్శలనెదుర్కొంటోంది. దీనికి తోడు లక్సెంబర్గ్‌లో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో సగానికి సగం మంది అంటే 2 లక్షల మంది బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీల నుంచి లక్సెంబర్గ్‌కి వచ్చేవారే.  అక్కడ అధిక వేతనాలు ఉండడమే అందుకు కారణం.

ఖర్చు మోపెడు
దీనివల్ల టిక్కెట్ల ద్వారా నష్టపోయే మొత్తం 44 మిలియన్‌ డాలర్లు. అయితే ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేస్తారు. ఉచిత రవాణా మొత్తానికి అయ్యే ఖర్చు 50 కోట్ల యూరోలు. ఈ ప్రాజెక్టు కారణంగా ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరు.  ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణికులే టిక్కెట్లు కొంటారు కనుక టిక్కెట్ల తనిఖీకి వెచ్చించాల్సిన సమయం తగ్గుతుంది. లక్సెంబర్గ్‌లో చాలా మంది కార్మికులకు సబ్సిడీతో కూడిన పాస్‌లు ఉంటాయి. టిక్కెట్టు కొనుక్కునేవారు తక్కువగానే ఉంటారు. ఇప్పుడు మిగిలిన వారికి కూడా ప్రయాణం ఉచితం కావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో వ్యక్తిపై 600 యూరోలు
ఉచిత ప్రయాణ సౌకర్యానికి మరో కారణం ప్రజారవాణా వ్యవస్థని బలోపేతం చేయడం. రాబోయే ఐదేళ్లలో ప్రజారవాణాని ఉపయోగించే వారి సంఖ్య 20 శాతం పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర యూరోపియన్‌ దేశాలకంటే లక్సెంబర్గ్‌ ప్రజారవాణా వ్యవస్థపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఏడాదికి 600 యూరోలు ఖర్చు చేస్తోంది.

పెట్రోల్, డీజిల్‌ ధరలు తక్కువ
లక్సెంబర్గ్‌లో కార్లు అధికం. వేతనాలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్‌ ధరలు తక్కువగా కావడంతో కార్ల వాడకం ఎక్కువ. ఈ ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఈ ఉచిత బాట. లక్సెంబర్గ్‌ ప్రజలతో పాటే పర్యాటకులకు సైతం అక్కడ ప్రయాణం ఉచితమే. అయితే ఫస్ట్‌ క్లాస్‌లో ప్రయాణించే వారికి మాత్రం టిక్కెట్టు వడ్డింపులు భారీగానే ఉంటాయి.  

మరిన్ని వార్తలు