2030 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే!

18 Jun, 2020 13:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/ కాలిఫోర్నియా : అమెరికన్ క్యాబ్ సేవల సంస్థ లిఫ్ట్ కార్పొరేషన్ జీరో-ఎమిషన్ వాహనాలకు మారే ప్రణాళికలను ప్రకటించింది. 2030 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలతో సేవలను అందించనున్నామని తెలిపింది. కొత్త విధానాలకు అనుగుణంగా కరోనా, లాక్ డౌన్ సంక్షోభ కాలాన్ని ఒక అవకాశంగా తీసుకుని సరికొత్తగా ముందుకు వెళుతున్నామని కంపెనీ ప్రకటించింది. అయితే  ఉద్గార నిబంధనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు వీలుగా  డ్రైవర్లకు దీనికి విధాన రూపకర్తలు , వాహన తయారీదారులు ఆర్థిక ప్రోత్సాహకాలందించాలని కోరింది.

కరోనా మహమ్మారి ప్రేరిత విపత్తునుంచి బయటకు రావాలని భావిస్తున్నట్టు లిఫ్ట్ సహ వ్యవస్థాపకుడు జాన్ జిమ్మెర్ తాజాగా వెల్లడించారు. అద్దె కార్ల కంపెనీలు, లక్షల మంది డ్రైవర్లను అందిస్తున్న స్వతంత్ర కాంట్రాక్టర్ల సమన్వయంతో పనిచేయనున్నామని తెలిపారు. తద్వారా లక్షల మెట్రిక్ టన్నుల కాలుష్య కారకాలను వాతావరణంలోకి రాకుండా నిరోధించవచ్చని కంపెనీ అభిప్రాయపడింది. బలమైన ఛార్జింగ్ నెట్‌వర్క్, అన్నింటికంటే ముఖ్యంగా డ్రైవర్ల సహకారం అవసరమన్నారు. అలాగే ఇ-వాహనాల వినియో డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందివ్వనున్నట్టు  తెలిపారు.

క్యాబ్ సేవల సంస్థలు సగటు ప్రయాణికుల కంటే 50 శాతం ఎక్కువ కాలుష్య కారకాలను వెదజల్లుతున్నాయని ఆరోపిస్తూ, ఉద్గారాలను తగ్గించేందుకు కొత్త నిబంధనలను తీసుకురానున్నట్టు కాలిఫోర్నియా రెగ్యులేటరీ నిర్ణయించింది. ఈ నిబంధనలు   లిఫ్ట్ కు ప్రతికూలంగా మారనున్నాయని విశ్లేషకులు అంచనా . దీంతో సంస్థ తాజా నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19, లాక్ డౌన్ కారణంగా క్యాబ్ సేవల కంపెనీలు సంక్షోభంలో పడిపోయాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ క్రమంలో లిప్ట్ కూడా 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం 1 శాతం కంటే తక్కువ ఎలక్ట్రిక్ కార్లను  లిఫ్ట్ నడుపుతోంది. 

మరిన్ని వార్తలు