మ్యాజిక్... మోదీ

9 Jun, 2016 02:13 IST|Sakshi
మ్యాజిక్... మోదీ
  • అమెరికా కాంగ్రెస్ మంత్రముగ్ధం
  •  మాట మాటకూ మోగిన చప్పట్లు.. కాంగ్రెస్ సభ్యుల హర్షామోదాలు
  •  మాట మాటకూ మోగిన చప్పట్లు.. కాంగ్రెస్ సభ్యుల హర్షామోదాలు
  •  45 నిమిషాల్లో 40 సార్లు కరతాళాలు.. 8 సార్లు లేచి నిల్చుని మరీ
  •  అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని చరిత్రాత్మక ప్రసంగం
  •  ప్రపంచానికి ఉగ్రవాదమింకా పెనుముప్పే.. ఉగ్రవాదాన్ని పోషిస్తోంది మా పొరుగునే
  •  వారిని ఏకాకులను చేయాలి.. ప్రోత్సాహకాలు నిరాకరించాలి
  •  

     అమెరికా, భారత్‌లు రెండూ ప్రపంచ శాంతి, సుసంపన్నతలను ఆకాంక్షిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం పెనుముప్పుగానే ఉంది. దానిని ఓడించడానికి కేవలం సైన్యం, నిఘా, దౌత్యం వంటి సంప్రదాయ పద్ధతులు మాత్రమే సరిపోవు. దానిపై చాలా స్థాయిల్లో పోరాడాలి. లష్కరే తోయిబా, తాలిబాన్, ఐసిస్ ఇలా విభిన్నమైన పేర్లు ఉండొచ్చు.. కానీ దాని సిద్ధాంతం ఒక్కటే.. విద్వేషం, హత్య, హింస. మానవాళిపై నమ్మకమున్న వారు ఉగ్రవాదంపై పోరాడటానికి ఒకటిగా ముందుకు రావాలి.

     - ప్రధాని నరేంద్ర మోదీ

    వాషింగ్టన్: మోదీ మాటలతో అమెరికా కాంగ్రెస్ సభ్యులు మంత్రముగ్ధులయ్యారు. ప్రధాని నోట వెలువడిన మాట మాటకూ చప్పట్లు చరుస్తూ హోరెత్తించారు. ఆయన ప్రసంగం ఆద్యంతం సభ్యులంతా చాలా సార్లు లేచి నిల్చుని మరీ చప్పట్లు చరుస్తూ తమ గౌరవమన్ననలు తెలియజేశారు. ముప్పావుగంట ప్రసంగంలో 40 సార్లు చప్పట్లతో హర్షామోదాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు.. అందులో 8 సార్లు లేచి నిల్చుని మరీ చప్పట్లు కొట్టటం విశేషం. అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయసభల సంయుక్త సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి ప్రసంగించారు. బుధవారం వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌లో హౌస్ ఆఫ్ చాంబర్స్‌లో జరిగిన ఈ సమావేశానికి మోదీ తన ప్రత్యేకమైన తెల్ల కుర్తా, పైజామాలపై నలుపు రంగు చేతులు లేని కోటును ధరించి హాజరయ్యారు.

    చట్టసభల సభ్యులందరూ లేచి నిల్చుని కరతాళ ధ్వనులతో సాదర స్వాగతం పలికారు. సభ్యులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్న మోదీ.. ఇరు దేశాల సంబంధ బాంధవ్యాలపై.. భవిష్యత్ మార్గంపై.. ప్రపంచంలో ఉమ్మడిగా పోషించగల పాత్రపై.. ఉగ్రవాదం విషయంలో అనుసరించాల్సిన విధానంపై అనర్గళంగా ఉపన్యసించారు. మధ్యమధ్యలో తనదైన శైలిలో చతురోక్తులతో సభ్యులను నవ్విస్తూనే.. అంతలోనే గంభీర అంశాలను ప్రస్తావిస్తూ వారిని సమ్మోహితులను చేశారు. అమెరికా కాంగ్రెస్ పనితీరు, భారత పార్లమెంటు పనితీరును పోల్చుతూ హాస్యమాడినపుడు.. అమెరికాలో యోగాకు ఆదరణ పెరుగుతున్నా తాము మేధో సంపత్తి హక్కు డిమాండ్ చేయలేదని ఛలోక్తి విసిరినపుడు.. కాంగ్రెస్ సభ్యులు పెద్ద పెట్టున నవ్వులతో చప్పట్లతో హోరెత్తించారు. మోదీ ప్రసంగం తర్వాత ప్రతినిధుల స్పీకర్ పాల్ ర్యాన్ తదితరులు ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. వివేకానంద, మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మా గాంధీ, అంబేడ్కర్, వాజపేయిలను ఉటంకిస్తూ మోదీ ప్రసంగం కొనసాగింది. భారత్ - అమెరికాల మధ్య పెరుగుతున్న బంధాలకు సంబంధించి అన్ని కోణాలనూ.. ప్రత్యేకించి వ్యూహాత్మక సంబంధాలు, పౌర అణు సహకారం గురించి ప్రస్తావించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భవిష్యత్తుకు పునాదులు బలపడిన నేపథ్యంలో గత కాలపు అవరోధాలను విడిచిపెట్టాలన్నారు.

    ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని భారతదేశానికి పొరుగునే పెంచి పోషిస్తున్నారంటూ ఆయన పరోక్షంగా పొరుగుదేశం పాకిస్తాన్‌ను ఎండగట్టారు. లష్కరే తోయిబా, తాలిబన్, ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఏదైనా సరే వాటి సిద్ధాంతం విద్వేషం, హత్యలేనని.. వాటి మధ్య ఎటువంటి తేడా చూపరాదని.. ఉగ్రవాదంపై ఒకే గొంతుతో పోరాడాల్సి ఉంటుందని అమెరికాకు సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని బోధించే వారికి ప్రోత్సాహం ఇవ్వటాన్ని నిరాకరించటం ద్వారా విస్పష్టమైన సందేశం పంపించాలని అమెరికా కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. తద్వారా పాక్‌కు అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయం ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్ నిరోధించటం గురించి పరోక్షంగా ప్రస్తావించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...


    వారిని ఏకాకులను చేసే ప్రాతిపదికపై సహకారం...
    ‘‘అమెరికా, భారత్‌లు రెండూ ప్రపంచ శాంతి, సుసంపన్నతలను ఆకాంక్షిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం పెను ముప్పుగానే ఉంది. దానిని ఓడించటానికి కేవలం సైన్యం, నిఘా, దౌత్యం వంటి సంప్రదాయ పద్ధతులు మాత్రమే సరిపోవు. దానిపై చాలా స్థాయిల్లో పోరాడాలి. భారత సరిహద్దుకు పశ్చిమం నుంచి ఆఫ్రికా వరకూ దానికి లష్కరే తోయిబా, తాలిబాన్, ఐసిస్ ఇలా విభిన్నమైన పేర్లు ఉండొచ్చు. కానీ దాని సిద్ధాంతం ఒక్కటే.. విద్వేషం, హత్య, హింస. దాని నీడ ప్రపంచమంతా విస్తరించి ఉన్నప్పటికీ.. దానిని పెంచి పోషిస్తోంది భారత్ పొరుగునే. మానవాళిపై నమ్మకమున్న వారు ఉగ్రవాదంపై పోరాడటానికి ఒకటిగా ముందుకు రావాలి.. ఆ మహమ్మారికి వ్యతిరేకంగా ఒకే గొంతుతో మాట్లాడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని బోధించే వారికి, ఆచరించే వారికి విస్పష్టమైన సందేశం పపించాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులను నేను కోరుతున్నా. వారికి ప్రోత్సాహం ఇవ్వటానికి నిరాకరించటం.. వారి చర్యలకు వారిని బాధ్యులుగా నిలబెట్టే దిశగా తొలి చర్య అవుతుంది. మనం మన భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకోవటం ఇప్పుడు తక్షణావసరం. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే, మద్దతిచ్చే, ప్రేరేపించే వారిని ఏకాకులను చేసే విధానం ప్రాతిపదికగా ఈ సహకారం ఉండాలి. అది మంచి, చెడు ఉగ్రవాదం అనే తేడా చూపని, ఉగ్రవాదాన్ని మతంతో వేరు చేసే విధానమై ఉండాలి. ఉగ్రవాదంపై పోరాటంలో మన రెండు దేశాలూ ప్రజలను, సైనికులను కోల్పోయాయి. 2008 నవంబర్‌లో ముంబైపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్‌కు మద్దతుగా అమెరికా నిలబడింది. అది మేం ఎన్నడూ మరచిపోం.
     

    వాణిజ్య అన్వేషణల్లో భారత్ మంచి భాగస్వామి...
    ఆర్థిక రంగంలో 7.6 శాతం వార్షిక వృద్ధి రేటుతో పయనిస్తున్న భారత్‌లో అపారమైన అవకాశాలున్నాయి. పురోగమిస్తున్న భారత్‌లోని ప్రతి రంగంలోనూ అమెరికాను ఒక అవిభాజ్య భాగస్వామిగా నేను చూస్తున్నా. ప్రపంచంలో అతి పెద్ద, అతి పురాతన ప్రజాస్వామ్యదేశాలైన భారత్, అమెరికాలు తమ దేశాల తాత్వికతల నుంచి, ఆచరణల నుంచి పరస్పరం చాలా నేర్చుకున్నాయి. మన ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించటమే కాదు.. మరింత సమైక్య, మానవీయ, సుసంపన్న ప్రపంచానికి వారధిలా ఉండేలా దృష్టి కేంద్రీకరించాలి.

     మా పౌరులకు భయం నుంచి స్వాతంత్య్రం ఉంది: భారత్ ఒకటిగా జీవిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, పండుగ చేసుకుంటుంది. నా ప్రభుత్వానికి రాజ్యాంగం నిజమైన పవిత్ర గ్రంథం. అది పౌరులందరికీ మత, వాక్‌స్వాతంత్య్రం, ఓటు హక్కు, సమానత్వాలను ప్రాథమిక హక్కులుగా అందిస్తుంది.  80కోట్ల మంది నా దేశ ప్రజలు ఐదేళ్లకోసారి  ఓటేయొచ్చు. కానీ.. మా 125 కోట్ల మందికీ భయం నుంచి ప్రతిక్షణం స్వాతంత్య్రముంది.


    వారు మీ బలం.. మాకు గర్వకారణం...
    మన రెండు దేశాలనూ అనుసంధానిస్తున్న మరో విశిష్ట వారధి 30 లక్షల మంది భారతీయ అమెరికన్లు. మీ ఉత్తమ సీఈఓలు, అధ్యాపకులు, వ్యోమగాములు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, వైద్యులు, చివరికి స్పెల్లింగ్ చాంపియన్లలోనూ వారు ఉన్నారు. వారు మీ బలం. వారు భారత్‌కు గర్వకారణం కూడా’’ అని మోదీ అన్నారు. అమెరికాలో 3 కోట్ల మంది పాటిస్తున్న యోగాపై మేధో హక్కులను డిమాండ్ చేయడం లేదని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఘొల్లున  నవ్వారు. అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ.. వాషింగ్టన్ నుంచి మెక్సికో వెళ్లారు.

     

     ''ఈ ప్రజాస్వామ్య దేవాలయం.. ప్రజాస్వామ్యం దిశగా వెళ్లేందుకు అనేక దేశాలకు స్ఫూర్తినిచ్చింది. ప్రోత్సాహాన్నిచ్చింది. లింకన్ మాటల్లో చెప్పాలంటే.. స్వేచ్ఛ, సమానత్వ భావనలకు ఊపిరులూదింది. ఇక్కడ ప్రసంగించే అవకాశం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా'' 

     - మోదీ

     

     మన బంధం శాంతి, సుస్థిరతలకు ఆధారం..

     భారత్ - అమెరికా సంబంధాలు ప్రబలమైన భవిష్యత్తు దిశగా పయనిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం.. ఆసియా నుంచి ఆఫ్రికా వరకూ హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకూ శాంతి, సుసంపన్నత, సుస్థిరతలకు పటిష్టమైన ఆధారంగా నిలవగలదు. సముద్ర వాణిజ్య మార్గాల భద్రతకు, సముద్ర ప్రయాణంలో స్వేచ్ఛను కాపాడటానికి సాయపడగలదు. హిందూమహాసముద్ర ప్రాంతాన్ని సురక్షితం చేసే బాధ్యతలను భారత్ ఇప్పటికే చేపడుతోంది. అయితే.. 20వ శతాబ్దపు ఆలోచనలతో రూపొందిన అంతర్జాతీయ సంస్థలు నేటి వాస్తవాలను ప్రతిబింబిస్తే మన సహకారం సామర్థ్యం మరింత పెరుగుతుంది.’’

     

     ఇదే స్ఫూర్తి పదే పదే చూస్తున్నా

     ‘‘అమెరికా కాంగ్రెస్ పనితీరు సామరస్యపూరితంగా ఉంటుందని నేను విన్నాను. రెండుగా విడిపోయి పనిచేయటంలో కూడా మీకు మంచి పేరు ఉందనీ నేను విన్నాను. బాగుంది.. మీరు ఒక్కరే కాదు. నేను ఎప్పటికప్పుడు భారత పార్లమెంటులో ఇదే స్ఫూర్తిని చూశాను.. ప్రత్యేకించి మా ఎగువ సభలో. మన  విధానాలు ఒకేలా ఉన్నాయి చూశారుగా’’ అని మోదీ పేర్కొన్నపుడు కాంగ్రెస్ సభ్యులు పెద్ద పెట్టున నవ్వులు, కరతాళ ధ్వనులతో స్పందించారు.

     

     మోదీ.. ఆరో ప్రధాని!

     అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానుల్లో మోదీ ఆరవ వ్యక్తి. తొలి ప్రధాని నెహ్రూ 1949 అక్టోబర్ 13న అక్కడ ప్రసంగించారు. ప్రపంచ శాంతి, మానవాళి స్వేచ్ఛ పరిరక్షణ లక్ష్యంగా తమ విదేశాంగ విధానం ఉంటుందన్నారు. జూన్ 13, 1985న నాటి ప్రధాని రాజీవ్ మాట్లాడుతూ.. సర్వ స్వతంత్ర, దృఢమైన, స్వయం సమృద్ధ భారత్ తన స్వప్నమన్నారు. 1994 మే18న పీవీ నరసింహరావు, 2000 సెప్టెంబర్ 14న వాజ్‌పేయి, 2005 జూలై 19న మన్మోహన్  అగ్రదేశ పార్లమెంటులో ప్రసంగించారు.

     

    యూఎస్ కాంగ్రెస్ ప్రశంసలు
    వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగంపై ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్‌తోపాటు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ప్రసంగం ఆలోచింపజేసేలా ఉందని స్పీకర్ పాల్ ర్యాన్ తెలిపారు. ప్రపంచంలో శాంతి, స్వాతంత్య్రం పరిఢవిల్లటంతోపాటు భారత-అమెరికా సంబంధాల గురించి మోదీ మాట్లాడిన తీరు అద్భుతమన్నారు. ఇరుదేశాల సంబంధాలు ఈ పర్యటనతో వేగం పుంజుకుంటాయని కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

    మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

     

     

>
మరిన్ని వార్తలు