గోల్కొండ వజ్రానికి రూ.45 కోట్లు

21 Jun, 2019 03:41 IST|Sakshi
ఆర్కాట్‌ వజ్రం

భారతీయ రాజుల వజ్రాభరణాలు, కళాఖండాలకు భారీ ధర

మొత్తం విలువ రూ.756 కోట్లు

400 వస్తువులను వేలం వేసిన క్రిస్టీస్‌

న్యూయార్క్‌: భారత్‌ను పాలించిన మహారాజులు, మొఘలులు వినియోగించిన వజ్రాభరణాలు న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ వేలంపాటలో కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రఖ్యాత క్రిస్టీస్‌ వేలంసంస్థ ఈ వేలం నిర్వహించింది. గోల్కొండలో దొరికిన  మిర్రర్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ వజ్రం, నిజాం ధరించిన గొలుసు, ఆర్కాట్‌ నవాబుకు చెందిన వజ్రం, స్వర్ణాభరణాలు, కత్తులు, రత్నాలుసహా దాదాపు 400 పురాతన వస్తువులను వేలం వేశారు. ‘మహారాజులు, మొఘలుల వైభవం’ పేరిట నిర్వహించిన ఈ వేలంలో క్రిస్టీస్‌ సంస్థకు రూ.756 కోట్లు వచ్చాయి.

భారతీయ నగలు, కళాఖండాలు గతంలో ఎన్నడూ ఇంతటి భారీ ధరకు అమ్ముడుపోలేదని క్రిస్టీస్‌ పేర్కొంది. 2011లో ఎలిజబెత్‌ రాణి సేకరించిన వస్తువులు రూ.14.4 కోట్ల ధర పలికాయి.  గోల్కొండలో దొరికిన 52.58 క్యారెట్ల బరువైన మిర్రర్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ వజ్రం రూ.45 కోట్లు పలికింది. ఆర్కాట్‌ నవాబుకు చెందిన 17 క్యారెట్ల గోల్కొండ వజ్రం(ఆర్కాట్‌–2) రూ.23.5 కోట్లకు అమ్ముడుపోయింది. హైదరాబాద్‌ నిజాం ధరించిన 33 వజ్రాలు పొదిగిన హారం రూ. 17 కోట్లు పలికింది.

ఇండోర్‌ మహారాజు యశ్వంత్‌ రావ్‌ హాల్కర్‌ 2 ధరించిన రత్నాలతో కూడిన  గొలుసు రూ. 1.44 కోట్లు, జైపూర్‌ రాజమాత గాయత్రీ దేవి ధరించిన వజ్రపుటుంగరం రూ. 4.45 కోట్లు, 1680–1720 కాలానికి చెందిన వజ్రాలు పొదిగిన హుక్కా సెట్‌ రూ.5.3కోట్లు, సీతారామాంజనేయుల ప్రతిమలున్న మరో హారం రూ. 5.12 కోట్లు పలికాయి. 5 వరసల ముత్యాల గొలుసు రూ.11.8 కోట్లకు, వజ్రాలహారం రూ. 1.5 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఖతార్‌కు చెందిన రాజకుటుంబం సేకరించిన ఈ ఆభరణాలను క్రిస్టీస్‌ వేలం వేసింది. మొఘల్‌ మహారాజు షాజహాన్‌ వాడిన బాకు రూ.23.4 కోట్లు పలికింది. హైదరాబాద్‌ నిజాం నవాబు వాడిన కత్తి రూ. 13.4 కోట్లు పలికింది. భారత్‌కు చెందిన ఒక కత్తి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. భారత్‌ సహా 45 దేశాలకు చెందిన ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొన్నారు. జైపూర్, ఇండోర్, బరోడా రాజవంశీకులకు చెందిన ఆభరణాలు, వస్తువులనూ ఈ వేలంలో పెట్టారు.  

షాజహాన్‌ కత్తి    మిర్రర్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ వజ్రం

మరిన్ని వార్తలు