లంక ప్రధానిగా రాజపక్స

27 Oct, 2018 03:38 IST|Sakshi
మహిందా రాజపక్స

నాటకీయ పరిణామాల మధ్య ప్రమాణం చేయించిన అధ్యక్షుడు సిరిసేన

బలనిరూపణకు మేం సిద్ధం: విక్రమసింఘే ప్రకటన

కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా విభేదాలతో నెట్టుకొస్తున్న సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు విడిపోయాయి. ప్రధాని రణిల్‌ విక్రమసింఘేను తొలగించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సకు ఆ పదవి కట్టబెట్టారు. రాజపక్స చేత సిరిసేన ప్రమాణం చేయిస్తున్న దృశ్యాలు శుక్రవారం మీడియాలో ప్రసారమయ్యాయి. విక్రమసింఘేకు చెందిన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యూఎన్‌పీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు సిరిసేన పార్టీ యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రీడమ్‌ అలియన్జ్‌(యూపీఎఫ్‌ఏ) ప్రకటించిన వెంటనే తాజా రాజకీయ డ్రామా మొదలైంది. విక్రమసింఘే పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సిరిసేన పార్టీ పార్లమెంట్‌కు సమాచారం ఇచ్చింది. తాజా పరిణామంపై పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే స్పందిస్తూ.. రాజపక్సను ప్రధానిగా నియమించడం చట్టవిరుద్ధమని, తానే ప్రధానిగా కొనసాగుతానని అన్నారు. పార్లమెంట్‌లో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  

మూడేళ్ల ‘మైత్రి’కి తెర: అవినీతి, ఆర్థిక అవకతవకలపై ఐకమత్యంతో పోరాడుతామంటూ మూడేళ్ల క్రితం మైత్రిపాల సిరిసేన, విక్రమ సింఘే పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అనంతరం అధికార కూటమికి రెఫరెండంగా భావించిన ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజపక్స స్థాపించిన కొత్త పార్టీ సంచలన విజయం సాధించడంతో ఈ రెండు పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. రక్షణ శాఖ మాజీ కార్యదర్శితో పాటు తనని హత్య చేయడానికి పన్నిన కుట్రను విక్రమసింఘే పార్టీ సీరియస్‌గా తీసుకోకపోవడంపై సిరిసేన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రతరమయ్యాయి. ప్రస్తుతం రాజపక్స–సిరిసేన పార్టీలకు పార్లమెంట్‌లో ఉమ్మడిగా కేవలం 95 సీట్లే ఉన్నాయి. సాధారణ మెజారిటీ సాధించాలంటే ఈ కూటమికి మరో 18 స్థానాలు అవసరం.

మరిన్ని వార్తలు