శ్రీలంక అధ్యక్షుడిగా సిరిసేన

10 Jan, 2015 02:45 IST|Sakshi
కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న సిరిసేన

51.2% ఓట్లతో గెలిచిన ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థి
మూడోసారి పగ్గాలు చేపట్టాలనుకున్న రాజపక్సకు షాక్
అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన, ప్రధానిగా విక్రమసింఘే ప్రమాణం
శుక్రవారం ఉదయమే అధ్యక్షభవనం వీడిన రాజపక్స

 
కొలంబో: వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించాలనుకున్న మహీంద రాజపక్సకు శ్రీలంక ఓటర్లు షాకిచ్చారు. రాజపక్స స్థానంలో ఒకప్పటి ఆయన మంత్రివర్గ సహచరుడు, ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థి మైత్రిపాల సిరిసేన(63)కు అధ్యక్ష పట్టం కట్టబెట్టి చరిత్రాత్మక తీర్పునిచ్చారు. 19 మంది పోటీ పడిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రాజపక్స 47.6 శాతంతో 57,68,090 ఓట్లు సాధించగా, సిరిసేన 51.2శాతంతో 62,17,162 ఓట్లు గెలుచుకుని శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 1.54 కోట్ల ఓటర్లలో దాదాపు 75% మందికి పైగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళులు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సిరిసేనకు అత్యధిక ఓట్లు లభించాయి. శ్రీలంక ఆరవ దేశాధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన ఎన్నికయ్యారని ఎన్నికల కమిషనర్ మహీంద దేశప్రియ ప్రకటించారు.
 
 అయితే, అంతకుముందే ఓటమిని అంగీకరించిన రాజపక్స అధ్యక్ష భవనం ‘టెంపుల్ ట్రీస్’ను వదలివెళ్లారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించినందుకు విజయానంతరం సిరిసేన రాజపక్సకు కృతజ్ఞతలు తెలిపారు.ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకే సిరిసేన దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. విక్రమసింఘే అధ్యక్ష ఎన్నికల్లో సిరిసేనకు మద్దతిచ్చిన ప్రతిపక్ష యునెడైట్ నేషనల్ పార్టీ నేత.  కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద వీరిద్దరితో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కే శ్రీపవన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సిరిసేన, విక్రమసింఘేలు.. తమకు మద్దతిస్తున్న పార్టీలతో కలిసి గురువారం విశాల సంకీర్ణ కూటమి ‘న్యూ డెమొక్రటిక్ ఫ్రంట్’ను  ఏర్పాటు చేశారు. అధికార మార్పిడి నిరాటంకంగా జరిగేందుకు సహకరిస్తానని శుక్రవారం ఉదయం తాను కలిసినప్పుడు రాజపక్స హామీ ఇచ్చారని విక్రమసింఘే వెల్లడించారు.
 
ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు
 ప్రపంచ దేశాలతో సత్సంబంధాలకు కృషి చేస్తానని శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తానని, అప్పుడు తాను చెప్పిన మార్పును తీసుకువస్తానన్నారు. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడబోనని స్పష్టం చేశారు. కాగా, తమిళ అతివాదులతో మెత్తగా వ్యవహరించడం కానీ, ఉత్తర శ్రీలంక నుంచి ఆర్మీని తొలగించడం కానీ చేయబోనని ఎన్నికల ప్రచారం సమయంలోనే సిరిసేన స్పష్టం చేశారు. దీన్నిబట్టి సిరిసేన పాలన రాజపక్స పాలన కన్నా భిన్నంగా ఉండబోదని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
 తమిళులకు విలన్ రాజపక్స.. కొద్ది వారాల క్రితం వరకు రాజపక్స ఓటమి అసాధ్యమన్న భావన ఉండేది. తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈని శ్రీలంకలో తుదముట్టించడం వల్ల దేశంలోని మెజారిటీ సింహళీయుల్లో ఆయనపై అభిమానం భారీగా పెరిగి, ‘కింగ్’ అనే బిరుదు లభించినా.. మైనారిటీ తమిళుల్లో మాత్రం ఆయన భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.  2009లో ఎల్టీటీఈతో పోరు సందర్భంగా పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం, తమిళులకు మరిన్ని అధికారాలిచ్చేందుకు రాజ్యాంగ సవరణ చేస్తానన్న హామీని అమలు చేయకపోవడం.. రాజపక్స పట్ల తమిళుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచాయి. అలాగే, రాజపక్స పాలనలో అవినీతి, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ ధోరణి ముప్పిరిగొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కూడా ఈ ఫలితాల్లో ప్రతిఫలించింది.
 
 తన సోదరులు గొతాభయను రక్షణ మంత్రిగా, బాసిల్‌ను ఆర్థిక మంత్రిగా, మరికొందరు సన్నిహిత బంధువులను ప్రభుత్వంలోని కీలక పదవుల్లో నియమించడంపై కూడా రాజపక్సపై విమర్శలు వచ్చాయి. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవాలన్న లక్ష్యంతో రాజపక్స రాజ్యాంగాన్ని సవరించి మరీ ఎన్నికలను రెండేళ్లు ముందుకు జరిపారు. ఎన్నికల ప్రకటన వెలువడినరోజే సిరిసేన 26 మంది అధికార సంకీర్ణ ఎంపీలతో కలసి రాజపక్స పాలనపై తిరుగుబాటు చేశారు. అధికార శ్రీలంక ఫ్రీడం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, ఆరోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రతిపక్ష కూటమి మద్దతుతో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. తిరుగుబాటుకు ముందురోజే రాజపక్సతో కలసి ఆయన డిన్నర్ చేయడం విశేషం.

మరిన్ని వార్తలు