పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి

18 Aug, 2019 09:49 IST|Sakshi
క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్య. ఇన్‌సెట్లో పేలుడు జరిగిన ప్రాంతం

అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో ఘటన

182 మందికి తీవ్ర గాయాలు

కాబూల్‌: ఓ పెళ్లి వేడుకల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆనందోత్సాహాల్లో సాగిపోతున్న ఆ కార్యక్రమంలో భారీ బాంబు విస్పోటనం సంభవించింది. ఈ ఘటన అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పేలుడు ధాటికి 63 మంది మరణించగా.. 182 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పెళ్లి వేడుకల్లో సుమారు 1200 మంది పాల్గొన్నట్టు సమాచారం. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో ఫంక్షన్‌ హాల్‌ ప్రాంతమంతా శవాల దిబ్బను తలపిస్తోంది.

ఓ పెండ్లి వేడుకలో ఈ ఘటన జరిగిందని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ ప్రతినిధి నస్రత్ రహీమి వెల్లడించారు. ఇది ఆత్మహుతి దాడి కావొచ్చునని అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ప్రతినిధి సెడిడ్‌ సిద్దిఖీ ట్విటర్‌లో అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. పశ్చిమ కాబూల్‌లోని ‘దుబాయ్‌ సిటీ’ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో షియా హజారా జాతికి చెందినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. షియా హజారా ప్రజలపై కావాలనే ఎవరైనా కక్ష పూరితంగా వ్యవహరించారా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు