మహిళలు, చిన్నారుల రక్షణకు కట్టుబడి ఉండాలి

8 Aug, 2019 14:46 IST|Sakshi

కశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌ స్పందించారు. కశ్మీర్‌లోని మహిళలు, చిన్నారుల రక్షణకు దక్షిణాసియా ప్రజలు, నాయకులు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా మలాలా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ లేఖను ట్వీట్‌ చేశారు.

‘నా చిన్నతనం నుంచి ఇంకా చెప్పాలంటే.. నా తల్లిదండ్రులు.. వారి తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పటి నుంచి కశ్మీర్‌లో సంక్షోభం నెలకొంది. గడిచిన ఏడు దశాబ్దాలుగా కశ్మీర్‌లో పిల్లలు హింస మధ్యే పెరుగుతున్నారు. నరకం చూస్తున్నారు. దక్షిణాసియా నాకు సొంతిల్లుతో సమానం. కాబట్టి కశ్మీర్‌ అంశంలో నా బాధ్యతను మర్చిపోలేను. దక్షిణాసియాలో కశ్మీర్‌తో సహా 1.8బిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. మనం భిన్న సంస్కృతులు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, భాషలు, సంప్రదాయాలు పాటిస్తున్నాం. అయినంత మాత్రాన నిరంతరం గొడవపడుతూ.. ఒకరినొకరం హింసించుకుంటూ బతకాల్సిన అవసరం లేదు. శాంతిని అలవర్చుకుంటూ కూడా మనం నివసించవచ్చు’ అని పేర్కొన్నారు.

‘ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత నేను కశ్మీర్‌లోని మహిళలు, చిన్నారుల భద్రత గురించి ఆలోచిస్తున్నాను. అక్కడ ఉన్న సంక్షోభం కారణంగా ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. దక్షిణాసియా ప్రజలు, అంతర్జాతీయ సమాజం, సంబంధిత అధికారులు దీనిపై స్పందిస్తారని అనుకుంటున్నాను. ప్రజల మధ్య ఎన్ని విభేదాలున్నా మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని మలాలా లేఖలో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు