పాక్‌లో అడుగు.. మలాలా కంటతడి!

29 Mar, 2018 18:39 IST|Sakshi

ఇస్లామాబాద్‌: చాలాకాలం తర్వాత స్వదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని నోబెల్‌ శాంతి పురస్కార గ్రహిత మలాలా యూసఫ్‌జాయ్‌ అన్నారు. గురువారం పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చిన ఆమె..  రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధాని షాహిద్‌ అబ్బాసీతో సమావేశమయ్యారు. ఆమెకు ఘనస్వాగతం పలికిన ప్రధాని అబ్బాసీ మాట్లాడుతూ.. 12 ఏళ్ల వయస్సులో దేశాన్ని వీడి, ఇప్పుడు ప్రముఖ వ్యక్తిగా మలాలా స్వదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ప్రధానిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మలాలా.. ‘ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేనిది. ఇప్పటికి నేను దీన్ని నమ్మలేకపోతున్నాను’ అని కంటతడి పెట్టారు. సాధారణంగా తాను ఏడవనని, వయస్సులో చిన్నదాన్నే అయినా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. ప్రస్తుత సమాజంలో బాలికల విద్య ఆవశ్యకత, మలాలా పౌండేషన్‌ ద్వారా చేస్తున్న కార్యక్రమాల గురించి ఆమె ప్రస్తావించారు. 2012లో తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మలాలాను పాక్‌ ప్రభుత్వం ఆధునిక వైద్యం కోసం బ్రిటన్‌కు పంపింది. దాడి తర్వాత స్వదేశానికి రావడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు