కరోనా చికిత్స: ఆ మందులు ప్రమాదకరం

3 Apr, 2020 13:16 IST|Sakshi

ఆరెగాన్‌ : కరోనా వైరస్‌ చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సిక్లోరోక్వైన్‌, యాంటీ బయోటిక్‌ అజిత్రో మైసిన్‌లు రోగి హృదయ స్పందనలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని యూఎస్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఈ మలేరియా యాంటీ బయోటిక్‌ డ్రగ్‌ కాంబినేషన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌కు దారి తీస్తుందని ఆరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్శిటీ అండ్‌ ఇండియానా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాంబినేషన్‌ డ్రగ్‌ల కారణంగా అనారోగ్యంతో ఉన్న వారి పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందంటున్నారు.  కొన్ని వందల రకాల మందులు కార్డియాక్‌ అరెస్ట్‌కు దారి తీస్తాయని వెల్లడించారు. ( కరోనా: వాటి మాయలో పడకండి! )

ఆరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్శిటీ ఫ్రొఫెసర్‌ ఎరిక్‌ స్టెకర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వైద్యులు మహమ్మారి చికిత్స కోసం హైడ్రాక్సిక్లోరోక్వైన్‌, యాంటీ బయోటిక్‌ అజిత్రో మైసిన్‌లు విరివిరిగా ఉపయోగిస్తున్నారు. కరోనా బాధితుడిపై అవి ఎంత వరకు సానుకూల ప్రభావం చూపుతాయన్న దానిపై మా దగ్గర చాలా తక్కువ సమాచారం ఉంది. ఈ కాంబినేషన్‌ను వాడుతున్న వారు దాని ద్వారా ఎదురయ్యే దుష్ప్రభావాలపై తప్పకుండా జాగ్రత్త వహించాలి. ఈ కాంబినేషన్‌తో చికిత్స చేస్తున్నవారు బాధితుల హృదయ స్పందనలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. ఏది ఏమైనా కరోనాకు మందు లేకపోవటాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల’ని అన్నారు.

మరిన్ని వార్తలు