మలేసియాలో మరణశిక్ష రద్దు

12 Oct, 2018 03:08 IST|Sakshi

కేబినెట్‌ చారిత్రక నిర్ణయం

నాలుగు రోజుల్లో పార్లమెంటుకు బిల్లు

కౌలాలంపూర్‌: మలేసియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేస్తామని ప్రకటించింది. ప్రధాని మహతీర్‌ మొహమ్మద్‌ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మలేసియా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో త్వరలో మరణశిక్ష అమలు కానున్న 1,200 మందికి పైగా ఖైదీలకు ఊరట లభించినట్లయింది. సాధారణంగా హత్య, డ్రగ్స్‌ అక్రమరవాణా, దేశద్రోహం, ఉగ్రదాడులు, కిడ్నాప్‌ వంటి ఘటనల్లో దోషులుగా తేలినవారికి మలేసియాలో ఇప్పటివరకూ మరణదండన విధిస్తున్నారు. తాజా నిర్ణయంపై మలేసియా న్యాయశాఖ మంత్రి ల్యూ వుయ్‌ కియాంగ్‌ మాట్లాడుతూ.. మరణదండనకు సంబంధిం చి సవరించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు.

అవినీతి రహిత పాలన అందిస్తామనీ, మరణశిక్షను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని వెల్లడించారు. కాగా, మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవహక్కుల సంస్థ‘లాయర్స్‌ ఫర్‌ లిబర్టీ’ స్వాగతించాయి. ఈ సందర్భంగా కొత్త చట్టంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని నేరాలకు మరణశిక్షను రద్దు చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రధాన కార్యదర్శి కుమీ నైదూ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 142 దేశాలు మరణదండనను తిరస్కరించాయని వెల్లడించారు. భారత్, సింగపూర్, చైనా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు ఇంకా మరణశిక్షను అమలు చేస్తున్నాయన్నారు.

మరిన్ని వార్తలు