భర్తలను స‌తాయించ‌కండి: మ‌లేసియా ప్ర‌భుత్వం

1 Apr, 2020 14:17 IST|Sakshi

కౌలాలంపూర్‌: కోవిడ్‌-19(క‌రోనా వైర‌స్‌) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ‌ ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఎక్క‌డివాళ్ల‌క్క‌డే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేప‌థ్యంలో కుటుంబంలోని భార్యాభ‌ర్తలు ఒక‌రి ముఖం మ‌రొక‌రు చూడ‌లేక‌, గొడ్డు చాకిరీ చేయ‌లేక గొడ‌వ‌ల‌కు దిగుతున్నారు. ప్ర‌తీ చిన్న విషయానికి భార్య‌ల‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా కొంద‌రు భ‌ర్త‌లు వ్య‌వ‌హ‌రిస్తుంటుంటే, దొరికిందే సంద‌ని కొంత‌మంది భార్య‌లు.. భ‌ర్త‌ల‌కు ఎదురు తిరుగుతూ వారితో ఇంటిప‌ని, వంట ప‌నీ చేయిస్తున్నారు. పైగా అందులో త‌ప్పేముంద‌ని బుకాయిస్తున్నారు. దీంతో త‌మ బాధ‌లు వ‌ర్ణ‌నాతీత‌మంటూ కొంద‌రు మ‌గరాయుళ్లు వీడియోలు తీస్తూ సోష‌ల్ మీడియాలో గోడు వెల్ల‌బోసుకుంటున్నారు. మ‌లేసియాలో వీరి ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంది. లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టినుంచి అక్క‌డ గృహహింస కేసులు 50 శాతానికి పైగా పెరిగాయి. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయ‌డంతోపాటు ఓ అడుగు ముందుకేసి మహిళామ‌ణుల‌కు కొన్ని ఉచిత స‌ల‌హాలిచ్చింది. (చదవండి: లాక్‌డౌన్‌ ఎంత పనిచేసింది?)

ఇంట్లో ఉంటున్న భార్య‌లు ఎలా న‌డుచుకోవాలో చెప్పుకొచ్చింది. అందులో భాగంగా భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ బ‌ట్ట‌లుతుకున్న ఫొటోను షేర్ చేసి ద‌య‌చేసి మీ మొగుళ్ల‌ను విసిగించ‌డం మానండని కోరింది. దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌త‌డంతో ఆ పోస్టును డిలీట్ చేసింది. ఆపై మ‌రో పోస్టులో వ‌ర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మ‌హిళామ‌ణులు కాస్త మేక‌ప్ వేసుకుని, మంచి బ‌ట్ట‌లు ధ‌రించాల‌ని సూచించింది. దీంతో ‘మేం ఎలాంటి బ‌ట్ట‌లు ధ‌రించాలో, ఎలా అలంక‌రించాలో అది కూడా మీరే చెప్పండి’ అంటూ నెటిజ‌న్లు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ సూచ‌న‌లు పురుషాధిక్య‌త‌, గృహహింసను ప్రోత్స‌హిస్తున్న‌ట్లుగా ఉన్నాయ‌ని తీవ్రంగా మండిప‌డ్డారు. దీంతో వెంట‌నే త‌న త‌ప్పు తెలుసుకుని నాలుక్క‌రుచుక‌న్న మ‌లేసియా ప్ర‌భుత్వం వెంట‌నే క్ష‌మాప‌ణలు చెప్పింది. అయితే ఇంటి నుంచి ప‌ని చేస్తున్న మ‌హిళ‌లు, వారి కుటుంబ స‌భ్యుల మ‌ధ్య సానుకూల సంబంధాల‌ను బ‌ల‌ప‌రిచే ల‌క్ష్యంతోనే ఈ సూచ‌న‌లు తెలిపిన‌ట్లు పేర్కొంది. (కోవిడ్‌: అయ్యో.. ఐరోపా)

మరిన్ని వార్తలు