చిన్నవాళ్లం... భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం!

20 Jan, 2020 13:09 IST|Sakshi

కౌలాలంపూర్‌: భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం కాదని మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌(94) వ్యాఖ్యానించారు. వాణిజ్యపరంగా భారత్‌తో ఏర్పడ్డ విభేదాలను అధిగమించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత కొన్ని నెలలుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మలేషియా ప్రధాని మహతీర్‌ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబరులో ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో మహతీర్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్నారు. కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 

ఈ నేపథ్యంలో మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని భారత్‌కు చెందిన ప్రముఖ ఆయిల్‌ ప్రాసెసర్ సంస్థలు నిర్ణయించాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్‌ దిగుమతిదారుగా ఉన్న భారత్‌ తాజా నిర్ణయంతో మలేషియా తీవ్రంగా నష్టపోతోంది. దాదాపు 10 శాతం మేర ఎగుమతులు పడిపోయాయి. ఇప్పటికిప్పుడు నూతన దిగుమతిదారు దొరక్కపోవడంతో మలేషియా వాణిజ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో లంగ్వావీలో సోమవారం విలేకరులతో మాట్లాడిన మహతీర్‌... తమ పామాయిల్‌ ఉత్పత్తులను భారత్‌ బాయ్‌కాట్‌ చేసినంత మాత్రాన తాము ప్రతీకార చర్యలకు దిగబోమన్నారు. ‘మేం చాలా చిన్నవాళ్లం. ప్రతీకారం తీర్చుకోలేం. అయితే దీనిని అధిగమించడం లేదా ఇందుకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనే మార్గాలు అన్వేషిస్తున్నాం’ అని పేర్కొన్నారు. (ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మలేషియా ప్రధాని)

అదే విధంగా సీఏఏ ప్రవేశపెట్టడం సరైంది కాదని మరోసారి అభిప్రాయపడ్డారు. ఇక పరారీలో ఉన్న వివాదాస్పద మత ప్రబోధకుడు జాకీర్‌ నాయక్‌ అప్పగింత విషయంలోనూ భారత్‌- మలేషియాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడటం, విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జాకీర్‌ నాయక్‌.. ప్రస్తుతం మలేషియాలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జాకీర్‌ను అప్పగించాల్సిందిగా భారత్‌ ఎన్నిసార్లు విఙ్ఞప్తి చేసినప్పటికీ మలేషియా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జాకీర్‌ను విచారిస్తామని భారత్‌ చెప్పినప్పటికీ... అతడికి చెడు తలపెట్టే అవకాశాలు ఉన్నాయన్న మహతీర్‌.. జాకీర్‌ను భద్రంగా చూసుకుంటూ.. అతడికి ఎటువంటి హాని తలపెట్టని దేశం (భారత్‌ కాకుండా)ఉందని భావించినపుడు మాత్రమే అతడిని తమ దేశం నుంచి బయటకు పంపించగలమని పేర్కొన్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు