భారత్‌తో విభేదాలు తాత్కాలికమే: మలేషియా

4 Feb, 2020 09:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

త్వరలోనే అన్ని సమస్యలు సమసిపోతాయి: మలేషియా మంత్రి

కౌలాలంపూర్‌: వాణిజ్యపరంగా భారత్‌తో తలెత్తిన విభేదాలు త్వరలోనే సమసిపోతాయని మలేషియా పరిశ్రమల శాఖ మంత్రి థెరిసా కోక్‌ పేర్కొన్నారు. మలేషియా పామాయిల్‌ ఉత్పత్తులపై భారత్‌ విధించిన నిషేధం తాత్కాలికమైందని భావిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా భారత ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మలేషియా ప్రధాని మహతీర్‌ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్న ఆయన.. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ క్రమంలో ప్రపంచంలోనే పామాయిల్‌ అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్‌... మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది. మలేషియాకు బదులు ఇండోనేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాలని సంబంధిత వ్యాపార సంస్థలకు సూచించింది. దీంతో వాణిజ్యపరంగా మలేషియాకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో మలేషియా మంత్రి థెరిసా కోక్‌ మంగళవారం మాట్లాడుతూ.. ‘‘భారత్‌- మలేషియాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఇరు దేశాలు అధిగమిస్తాయని భావిస్తున్నాం. పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాం. పామాయిల్‌ కొనుగోలుపై భారత్‌ నిర్ణయం తాత్కాలికమే అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. బీ20 బయోడీజిల్‌ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని... తద్వారా పామాయిల్‌ ధరలు నిలకడగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.(చిన్నవాళ్లం... భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు