భారత అమరవీరులకు మాల్దీవులు సంతాపం

19 Jun, 2020 19:21 IST|Sakshi
మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌ (ఫైల్‌ ఫొటో)

భారత అమర జవాన్లకు మాల్దీవులు, అమెరికా, జర్మనీ సంతాపం

మాలే: భారత్‌- చైనా సరిహద్దుల్లో చెలరేగిన హింసాత్మక ఘర్షణలో వీర మరణం పొందిన భారత సైనికులకు మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. సరిహద్దు ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన ఆయన.. భారత ప్రజలు, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, జర్మనీ రాయబారి వాల్టర్‌ జే లిండ్నర్ సైతం శుక్రవారం భారత అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ‌కాగా గాల్వన్‌ లోయ ప్రాంతంలో చైనా దురాగతాలను ఎదుర్కొనే క్రమంలో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చైనా- భారత్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అమెరికా పేర్కొనగా.. ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదంలో భారత్‌కు మద్దతుగా ఉంటామని రష్యా ప్రకటించింది.(బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు!)

కుయుక్తుల డ్రాగన్‌.. షాకిచ్చిన మాల్దీవులు
ఇక భారత్‌కు రక్షణపరంగా ఎంతో ముఖ్యమైన మాల్దీవుల్లో 1100లకు పైగా దీవులు ఉన్నాయి. ఈ కారణంగా మాల్దీవులకు భారత్‌ సుదీర్ఘకాలంగా రక్షణ కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ను దెబ్బతీసేందుకు 2012లో మాల్దీవులు గద్దెనెక్కిన అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను మచ్చిక చేసుకున్న చైనా.. ఆయనతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశానికి సంబంధించిన ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.

ఈ నేపథ్యంలో గతేడాది ఎన్నికల్లో అధ్యక్ష పీఠం దక్కించుకున్న ఇబ్రహీం మహ్మద్‌ సోలి భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా తన ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించగా.. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు, ఒకరి ఆశయాలు, ప్రయోజనాల్ని మరొకరు పరస్పరం గౌరవించుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. మరోవైపు.. చైనాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌- ఎఫ్‌టీఏ)ను ఉపసంహరించుకుని ఇబ్రహీం డ్రాగన్‌కు పెద్ద షాకిచ్చారు. భారత్‌తో మాత్రం తమ బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు