అమ్మకానికి మాల్దీవులు.. భారత్‌ గుండెల్లో రైళ్లు?

4 Mar, 2017 13:31 IST|Sakshi
అమ్మకానికి మాల్దీవులు.. భారత్‌ గుండెల్లో రైళ్లు?
న్యూఢిల్లీ: దక్షిణాసియా దేశమైన మాల్దీవులు 26 ద్వీపాల సమూహం. ఆ ద్వీపాల్లో ఒకదాన్ని అమ్మకానికి పెట్టింది మాల్దీవులు. దీంతో మాల్దీవులకు అతి చేరువలో ఉన్న భారత్‌కు ఇరుగుపొరుగులో మరో భద్రతా సమస్య ఏర్పడినట్లే. మాల్దీవుల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అబ్దుల్లా యమీన్‌ ప్రభుత్వం సౌదీ అరేబియాకు 'ఫాఫు' అనే ద్వీపాన్ని అమ్మాలని యోచిస్తోంది. ఈ విషయంపై మాట్లాడిన మాల్దీవుల్లోని ప్రతిపక్ష మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ దేశంలో వహబిజంను దేశంలో మరింత విస్తరింపజేసే విధంగా ఉందని పేర్కొంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నా ఓ పరాయి దేశానికి భూమిని అమ్మడానికి ప్రభుత్వం వెనకాడటం లేదని తెలిపింది. 
 
గతంలో ఇతర దేశస్థులకు మాల్దీవుల్లో భూమిని అమ్మితే వారిని ఉరి తీసేవారు. ఆ నిబంధనలను 2015లో చేసిన రాజ్యంగా సవరణ ద్వారా సడలించారు. అతి తక్కువ భూభాగం కలిగి ఉండే మాల్దీవుల్లో విదేశీయులకు భూమిని అమ్మడాన్ని అక్కడి ప్రజలు కూడా నిరసిస్తున్నారు. ఫాఫు ద్వీపం కొనుగోలు గురించి సౌదీ కింగ్‌ త్వరలోనే మాల్దీవుల పర్యటనకు రానున్నారు. మాల్దీవుల్లో సౌదీ భూమిని అమ్మడానికి చాలా కారణాలు ఉన్నాయి.  సౌదీ ప్రతి ఏటా 300మంది మాల్దీవియన్లకు విద్యకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఇప్పటికే 70 శాతం మందికిపైగా మాల్దీవియన్లు వహబిజాన్ని స్వీకరించారు. 
 
భారత్‌కు చుట్టూ ఉన్న పొరుగుదేశాల్లో ప్రధానమంత్రి పర్యటించని ఒకే ఒక దేశం కూడా మాల్దీవులే. మాల్దీవుల్లోని అంతర్గత వ్యవహారాల కారణంగా భారత ప్రభుత్వం వారితో సంబంధాలు పెట్టుకునేందుకు ఇష్టపడలేదు. కానీ, ఇకపై ఆ దేశంతో సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరాన్ని తాజా పరిస్ధితులు కల్పించాయి. వచ్చే ఏడాది మాల్దీవుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలు ధృడమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని వార్తలు