చైనాకు షాక్‌; భారత్‌ పైచేయి!

19 Nov, 2018 20:31 IST|Sakshi
మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలితో భారత ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్‌ ఫొటో))

మాలే : మాల్దీవులు నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలి చైనాకు భారీ షాక్‌ ఇచ్చారు. చైనాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌- ఎఫ్‌టీఏ)ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం తమ దేశానికి అంత శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు.

ఈ విషయమై మాజీ అధ్యక్షుడు, అధికార మాల్దీవియన్‌ డెమెక్రటిక్‌ పార్టీ అధినేత మహ్మద్‌ నషీద్‌ మాట్లాడుతూ.. ‘ చైనా మా దేశం నుంచి ఏమీ కొనడం లేదు. ఇది కేవలం ఏకపక్ష ఒప్పందంలా ఉంది. ఇదొక తప్పుడు నిర్ణయం. అందుకే దీనిని రద్దు చేయాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో పగడపు దేశంలో విలాసవంతమైన రిసార్టులు నిర్మించి మెల్లగా ఆ దేశంపై పట్టు సాధించాలని యోచించిన చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగినట్లయింది.

పైచేయి సాధించిన భారత్‌!
2012లో నాటి అధ్యక్షుడు నషీద్‌ ప్రభుత్వాన్ని పోలీసు, సైనిక తిరుగుబాటుతో కూల్చివేసి అబ్దుల్లా యమీన్‌ అధ్యక్షుడయ్యాక మాల్దీవుల్లో చైనా పలుకుబడి, వ్యాపారం విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆయన చైనాతో ఎఫ్‌టీఏ కుదుర్చుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత అధికార పక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ యమీన్‌ తన ప్రయత్నాన్ని విరమించకుండా పార్లమెంటులో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి.. తన పలుకుబడితో ఆమోదింప చేశారు.

ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా తమ దేశానికి సహాయం చేస్తూ వస్తున్న భారత్‌ను పక్కన పెట్టి.. చైనాకు దగ్గరయ్యారు. దీంతో చైనా కూడా మాల్దీవులకు సంబంధించిన ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ భారత్‌పై పైచేయి సాధించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే తన నియంత పోకడలతో అభివృద్ధి కంటకుడిగా, భారత్‌ విరోధిగా ముద్రపడ్డ యమీన్‌ సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు.

ఫలించిన మోదీ మంత్రం!
కాగా చైనాతో సంబంధాలు మెరుగుపరచుకునే నేపథ్యంలో ఇన్నాళ్లు తమకు అండగా నిలిచిన భారత్‌కు దూరమవ్వకూడదనే భావనతో నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ను దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన తన ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం ద్వారా ముందడుగు వేశారు. ఈ క్రమంలో మాల్దీవులు చేరుకున్న మోదీ ఇబ్రహీంతో సమావేశమై చర్చలు జరిపారు. అభివృద్ధి, శాంతి కోసం మాల్దీవులు చేస్తున్న ప్రతీ ప్రయత్నానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు, ఒకరి ఆశయాలు, ప్రయోజనాల్ని మరొకరు పరస్పరం గౌరవించుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. ఈ విధంగా తమను దౌత్యపరంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించిన చైనాకు భారత్‌ చెక్‌ పెట్టినట్లయింది.

ఇక భారత్‌కు రక్షణపరంగా ఎంతో వ్యూహాత్మకంగా ఉన్న మాల్దీవుల్లో 1100లకు పైగా దీవులు ఉన్నాయి. ఈ కారణంగా మాల్దీవులకు భారత్‌ ఎప్పటినుంచో రక్షణ కల్పిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు