6.2 టన్నులు.. భారత్‌కు ధన్యవాదాలు: మాల్దీవులు

11 Apr, 2020 10:01 IST|Sakshi

ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు

మాలే/మాల్దీవులు: కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై పోరులో తమకు అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌ ధన్యవాదాలు తెలిపారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందులను సరఫరా చేయమన్న తమ అభ్యర్థనను భారత్‌ మన్నించిందని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తున్న హెచ్‌సీక్యూ పంపి.. ఆపత్కాలంలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడని భారత్‌ నిరూపించిందన్నారు.  6.2 టన్నుల డ్రగ్స్‌ సరఫరా చేసి తమను ఆదుకున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. కలిసికట్టుగా ఉంటే కోవిడ్‌-19ను అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు షాహిద్‌ ట్వీట్‌ చేశారు.(కరోనా: ఆ దేశాలపై వీసా ఆంక్షలకు ట్రంప్‌ నిర్ణయం)

కాగా కరోనా వ్యాపిస్తున్న తరుణంలో మహమ్మారిని ఎదుర్కొనేందుకు కలసికట్టుగా పోరాడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ సార్క్‌ దేశాల కు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ‘‘కరోనాతో పోరాడేందుకు సార్క్‌ దేశాల నాయకత్వంలో వ్యూహాలు రచించాల్సిందిగా నేను ప్రతిపాదిస్తున్నాను. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మనం చర్చిద్దాం. మన పౌరులను ఆరోగ్యవంతులుగా ఉంచుదాం. ఆరోగ్యకరమైన గ్రహం కోసం సంయుక్తంగా పనిచేసి ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుద్దాం’’అని మోదీ ఇచ్చిన పిలుపునకు మాల్దీవులు సానుకూలంగా స్పందించింది. కరోనాను అరికట్టేందుకు మోదీ చొరవ చూపడం హర్షించదగ్గ విషయమని ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మత్‌ సోలీ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.(ఇజ్రాయెల్‌కు ఐదు టన్నులు సరఫరా.. మోదీకి థాంక్స్‌!)

కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల వినియోగం సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర 30 దేశాలు దీనిని ఎగుమతి చేయాల్సిందిగా బారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. అయితే తొలుత స్థానిక అవసరాల నిమిత్తం అత్యవసర మందుల సరఫరాపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం ప్రస్తుతం దానిని ఎత్తివేసింది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్‌సీక్యూ సరఫరా చేయగా ఆయా దేశాధినేతలు భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తమ అభ్యర్థనను మన్నించినందుకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో, తాజాగా మాల్దీవులు ప్రభుత్వం కూడా కృతజ్ఞతలు తెలిపాయి. (కోవిడ్‌ చికిత్సకు హెచ్‌సీక్యూ–ఐజీ)

మరిన్ని వార్తలు