షాకింగ్‌ : యువతి మృతదేహంలో యువకుడి డీఎన్‌ఏ

30 Oct, 2019 14:04 IST|Sakshi

లాహోర్‌ : సాధారణంగా ప్రతీ ఒక్కరి శరీరంలో జన్యు కణాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ ప్రముఖ పాత్ర పోషిస్తాయన్న సంగతి మనందరికి తెలిసిందే. కానీ పాకిస్తాన్‌లో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన యువతి మృతదేహంలో యువకుడికి సంబంధించిన డీఎన్‌ఏ కణాలను గుర్తించినట్లు పాకిస్తానీ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్‌ కాలేజీలో నిమృత కుమారి ఫైనల్‌ ఇయర్‌ చదువుతుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే నిమృత ఈ ఏడాది సెప్టెంబర్‌ 16న తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

డీఎన్‌ఏ పరీక్షల కోసం సెప్టెంబర్‌ 17న నిమృతా  మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను  జంషోరూ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. పరీక్షల నిర్వహణ సమయంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడినట్లు పోలీస్‌ అధికారి మసూద్‌ బంగాశ్‌ వెల్లడించారు. 'నిమృతా దేహం నుంచి సేకరించిన రక్త నమూనాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాము. అయితే ఆ నివేదికలో మాత్రం అబ్బాయికి సంబంధించిన డీఎన్‌ఏ వివరాలు రావడం మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని' మసూద్‌ తెలిపారు. ఇన్నాళ్లు మేం నిమృతా ఆత్మహత్య చేసుకుందన్న కోణంలో భావించాము. కానీ ఎప్పుడైతే డీఎన్‌ఏలో వేరొకరికి సంబంధించిన వివరాలు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగిందని ఆయన పేర్కొన్నారు.

దీంతో విషయం తెలుసుకున్న నిమృత కుటుంబసభ్యులు ఆమెని ఎవరో హత్య చేశారని ఆరోపణలతో సింద్‌ హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన సింధ్‌ న్యాయస్థానం... నిమృత కేసులో జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని  తెలిపారు. నిమృతది హత్యా? ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా సెప్టెంబర్‌లో కాలేజ్‌లో హిందూ, మైనారిటీకి సంబంధించి ప్రిన్సిపాల్‌తో జరిగిన గొడవలో నిమృత ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు.

అయితే ఈ కేసుకు సంబంధించి 32 మందితో పాటు మృతురాలి కాల్‌డేటా ఆధారంగా  తోటి విద్యార్థులైన మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్లను అనుమానితులుగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విషయమై కాలేజీలో విచారించగా నిమృత తన హాస్టల్‌ గదిలోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఇదే విషయమై నిమృతా సోదరుడు విశాల్‌ స్పందిస్తూ.. నా సోదరిది ముమ్మాటికి హత్యేనని, ఆమె మెడకు కేబుల్‌ వైర్‌తో బిగించిన గుర్తులు ఉన్నాయని, అంతేగాక ఆమె చేతులను ఎవరో బలవంతంగా పట్టుకున్న గుర్తులు కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు.

అయితే పోలీసులు మాత్రం మెహ్రన్‌ అబ్రో, నిమృతాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, శారీరకంగా కూడా దగ్గరయ్యారని చెబుతున్నారు. నిమృతా పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అబ్రో ఈ అఘాయిత్యానికి ఏమైనా ఒడిగట్టాడా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు