బతకాలనే కోరిక.. సాటి మనుషులపై నమ్మకం

26 Jan, 2018 19:13 IST|Sakshi

ఫ్లోరిడా : అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. అదే అడిగితే ఎవరో ఒకరు స్పందిస్తారు. తమకు తోచిన సాయం చేస్తారు. అందుకు ఈ ఘటన చక్కటి ఊదాహరణగా నిలుస్తోంది. సహాయాన్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కోరతారు. కొత్త ఆలోచనతో సరికొత్త పద్థతిలో సహాయాన్ని కోరి విజయం సాధించాడు లీబౌట్జ్‌.  శరీరంలో అతి ముఖ్యమైన భాగం కిడ్నీ సక్రమంగా పనిచేయక, కొన్ని రోజుల్లోనే మరణిస్తామని తెలిసినప్పుడు ఎవరైనా కుంగిపోతారు. కానీ లీబౌట్జ్‌ మాత్రం తన కిడ్నీ 5 శాతమే పనిచేస్తుందని తెలిసినా.. ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. కిడ్నీ దాతల కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. బతకాలనే కోరిక చావలేదు. చివరికి సాటి మనుషులపై ఉన్న నమ్మకంతో వినూత్న ప్రయత్నం చేశాడు. తన బాధను ఇతరులతో పంచుకోవాలని, వారి నుంచి సహాయం పొందాలని భావించాడు. 

ఇందుకు ఎల్లప్పుడూ సందర్శకులతో రద్దీగా ఉండే డిస్నీ వరల్డ్‌ని ఎంచుకున్నాడు. తన అవస్థని ఇతరులకు తెలుపడానికి విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన టీషర్ట్‌ పైన బ్లడ్‌ గ్రూపు 'ఒ' పాజిటివ్‌ అని, తనకు కిడ్నీ కావాలని సందేశాన్ని తెలుపుతూ తన ఫోన్‌ నెంబర్‌ని రాశాడు. ఆ టీషర్ట్‌నే వేసుకుని, అక్కడే వారం రోజులపాటు తిరుగుతూ ఉన్నాడు. దీనిని గమనించిన కొందరు సందర్శకులు అతని ఫోటోలను తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అప్పుడే అతని ప్రయత్నానికి ముందడగు పడింది. ఒక్క రోజులోనే ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క రోజులో 32వేల షేర్లు, వారం రోజుల్లో 90వేల షేర్లు వచ్చాయి.

మానవత్వం బతికే ఉందటూ లీబౌట్జ్‌కు కిడ్నీ ఇవ్వడానికి వందలాది మంది దాతలు ముందుకొచ్చారు. వారిలో నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించగా... అందులో రిచీ సల్లీ అనే వ్యక్తి శాంపిల్స్‌ మ్యాచ్‌ అయినట్టు డాక్టర్లు చెప్పారు. కిడ్నీ ఫెయిల్‌ అవ్వడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. కానీ జీవితంపై ఆశతో లీబౌట్జ్‌ చేసిన ప్రయత్నం విజయం సాధించింది. కాగ, లిబౌట్జ్‌ దాదాపు 15 ఏళ్లుగా ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.


 

మరిన్ని వార్తలు