ఏడు నెలల తర్వాత భూమిపై అడుగు

28 Dec, 2017 13:07 IST|Sakshi
ఏడు నెలల తర్వాత భూమిపై అడుగుపెడుతున్న రెకెట్‌

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : బిగ్నీ రెకెట్‌ ఓ యాత్రా ఔత్సాహికుడు. ప్రపంచయానం చేయాలనే ఉద్దేశంతో 2014లో అమెరికాను వదిలి ఇండియాకు వచ్చాడు. అక్కడి నుంచి పోలెండ్‌ వెళ్లేందుకు చిన్న పడవను కొనుగోలు చేశాడు. దానికి మరమ్మత్తులు చేయించి హిందూ మహా సముద్రంలో తన ప్రయాణాన్ని ఆరంభించాడు. అలా ప్రయాణం మొదలు పెట్టిన రెకెట్‌ పడవ సముద్ర జలాల ఉరవడికి దారి తప్పి మొజాంబిక్ దేశానికి చేరువలో గల కొమొరోస్‌ ఐలాండ్‌కు చేరింది.

దీంతో అక్కడి నుంచి దక్షిణాఫ్రికా చేరుకుందామని భావించాడు రెకెట్‌. మొజాంబిక్‌ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే రూటు వాణిజ్య నౌకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ మార్గంలో నీటి ఉధృతి కూడా అధికమే. ఆ మార్గంలో ప్రయాణించడం రెకెట్‌కు పెను సవాలుగా మారింది. నీటి వేగానికి అదుపుతప్పిన పడవ హిందూ మహా సముద్రంలో తప్పిపోయింది. దాదాపు ఏడు నెలలుగా సముద్రంలోనే ఉండిపోయారు. ఈ సమయంలో కేవలం చైనీస్‌ సూప్‌, చేపలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ప్రాణం నిలుపుకుంటూ వచ్చారు.

రెకెట్‌ ఒంటరి ప్రయాణంలో తోడుగా నిలిచింది ఆయన పెంపుడు పిల్లి. దారి తప్పి తమ జలాల్లోకి వచ్చిన రెకెట్‌ను ఫ్రెంచ్‌ కోస్ట్‌ గార్డు సైనికులు రక్షించారు. ఏడు నెలలు సముద్రంలో తప్పిపోవడంపై మాట్లాడిన రెకెట్‌.. ఎన్నోసార్లు భూ భాగం కళ్ల ముందు కనిపించినా అక్కడకు పడవను మళ్లించలేని పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈ సమయంలో రెండు వేల కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసినట్లు వెల్లడించారు. చైనీస్‌ సూప్‌, వేటాడిన చేపలను తింటూ బతికినట్లు తెలిపారు.  రెకెట్‌కు వైద్య పరీక్షలు చేయించిన ఫ్రెంచ్‌ కోస్ట్‌ గార్డు మాల్‌న్యూట్రిషన్‌ మినహా ఆయనకు ఎలాంటి సమస్యా లేదని పేర్కొంది.

మరిన్ని వార్తలు