జీవితంపై విరక్తి పుట్టి మేకగా మారాడు

28 May, 2016 20:24 IST|Sakshi
జీవితంపై విరక్తి పుట్టి మేకగా మారాడు

పాశ్చాత్య జీవితం పట్ల విరక్తి చెందిన ఓ వ్యక్తి వలస వెళ్లి మరీ మేకలాగా జీవితం గడుపుతున్నాడు. లండన్ లో విలాసవంతమైన జీవితంలో ఏం తక్కువయ్యిందో ఏమో 35 ఏళ్ల థామస్ థ్వైటెస్  తన మిగతా జీవితాన్ని స్విట్జర్లాండ్ లో విభిన్నంగా గడపాలనుకున్నాడు.  అందుకు ఒక జీవనశైలిని కూడా ఎంచుకున్నాడు. అదేంటని అనుకుంటున్నారా..!  మేకలాగా జీవనం సాగించడం. నాలుగు కాళ్లతో నడుస్తూ.. పర్వతాలపై తిరుగుతూ తమ ఆహారాన్ని వెతుక్కునే ఈ జీవుల్లా బతకాలని నిర్ణయించుకున్నాడు. అంతే తన కాళ్లు, చేతులకు సరిపడే విధంగా(పర్వతాలపై నడవడానికి వీలుగా) నాలుగు కాళ్లను, గడ్డి తినడానికి కృత్రిమ పొట్టను తయారు చేయించుకున్నాడు.

అక్కడి మేకలతో పాటు తిరుగుతూ గడ్డి మేస్తూ హాయిగా జీవనం గడుపుతున్నాడు. ఇప్పటికి ఏడాదిగా ఇలా జీవనాన్ని కొనసాగిస్తున్న థామస్ ను గొర్రెల కాపరులు తమ మందలతో పాటు తిప్పి తీసుకువచ్చేందుకు ఒప్పుకున్నారు. ప్రత్యేకంగా మేక సైకాలజీలో గ్రాంట్స్ యూనివర్సిటీలో థామస్ పట్టా కూడా పొందాడు. తనతో పాటు తిరిగి గడ్డిని మేసే మేకలకు అనుమానం రాకుండా ఉండటానికి, తిన్న గడ్డిని కృత్రిమ పొట్టలోకి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఏడాదిగా మేక జీవితం గడుపుతున్న మీరు ఏం తెలుసుకున్నారు? అని థామస్ ను ప్రశ్నించగా మేకలు కష్టమైన జీవితాన్ని గడుపుతాయని, వాటి సంరక్షణ కోసం పోరాడుతాయని తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. మనుషుల కంటే మేకలు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాయని స్విట్జర్లాండ్ వచ్చాక తాను అటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని వివరించాడు.

మరిన్ని వార్తలు