జపాన్‌లో విద్యార్థినులపై కత్తులతో దాడి

29 May, 2019 08:48 IST|Sakshi
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సహాయక సిబ్బంది

ఇద్దరు మృతి.. 17 మందికి గాయాలు

కవాసకీ: జపాన్‌లోని కవాసకీ నగరంలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. స్కూల్‌ విద్యార్థినులే లక్ష్యంగా ఓ వ్యక్తి కత్తులతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఘటనలో ఓ విద్యార్థిని సహా ప్రభుత్వ ఉద్యోగి మరణించారు. 17 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన నోబోరిటో పార్క్‌ సమీపంలో ఉన్న బస్టాప్‌లో చోటుచేసుకుంది. గాయాలైన వారిలో 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది కారిటాస్‌ గాక్వెన్‌ అనే పాఠశాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులంతా బస్‌ కోసం వేచి చూస్తున్న క్రమంలో ఓ వ్యక్తి రెండు చేతులతో కత్తులు పట్టుకుని దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఘటనకు కారణమైన వ్యక్తి గొంతు కోసుకుని మరణించాడని పోలీసులు వెల్లడించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు