ఓ తాతయ్య నిర్వాకం..

4 Nov, 2015 13:22 IST|Sakshi
ఓ తాతయ్య నిర్వాకం..

లాస్ ఏంజిల్స్ : అమ్మమ్మ తాతయ్య దగ్గర పసివాళ్లు బాగా కలిసిపోతారు కదా... మనలో చాలామంది బాల్యంలో వారితో  గడిపిన జ్ఞాపకాలు జీవిత కాలం పదిలంగా దాచుకుంటాం. కానీ  అమెరికాలో ఓ అయిదేళ్ల మనవరాలికి... తాతయ్య భయంకరమైన అనుభవాన్ని మిగిల్చాడు. తనతో పాటు బయటికి  తీసుకెళ్లిన మనవరాలిని ఎడారిలో వదిలేశాడు.

 

అంతేకాదు 45 కాలిబర్  తుపాకీని ఫుల్ గా లోడ్ చేసి, ఆమెకిచ్చి కామ్ గా ఇంటికి వచ్చేశాడా తాతయ్య . అమెరికాలోని ఆరిజోనాలో మొన్న ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాప కనిపించకపోవడంతో  తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా గాలింపు  చర్యలు చేపట్టారు. గిలా నదికి వెళ్లే మార్గంలోని  ఎడారిలో ఆమె ఆచూకీ కనుగొన్నారు.


మారికోపా కౌంటీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం   పాల్ రాటర్ (53) మనవరాలితో బయటకు వెళ్లాడు. ముందు బర్గర్ తిని, ఫుల్ గా మద్యం సేవించాడు. ఆ తరువాత  ఆ చిన్నారికి లోడ్ చేసిన గన్ ఇచ్చాడు. మద్యం మత్తులో ఉన్నాడో ఏమో తెలియదు కానీ   ఆ చిన్న పిల్లను ఎడారిలో ఒంటరిగా వదిలేసి వెనక్కి వచ్చేసాడు.  పాపను కనీసం ఎడారిలో వదిలేసినట్లు కూడా ఎవరికీ చెప్పలేదు.  

తల్లిదండ్రుల ఫిర్యాదు నేపథ్యంలో చిన్నారిని హింసించిన కేసులో పాల్ రాటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పాప ఇక నడవలేనని చెప్పడంతో అందుకే ఆమెను ఓ చెట్టుకింద వదిలేసినట్లు రాటర్ విచారణ అధికారులతో చెప్పడం గమనార్హం.  కాగా తాతయ్య ఇలా ఎందుకు చేశారో అర్థం కాలేదని బెదిరిపోతున్న కళ్లతో ఆ చిన్నారి తన  అమ్మమ్మతో తెలిపింది. ఎట్టకేలకు చిన్నారి క్షేమంగా తమ వద్దకు చేరటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
 

మరిన్ని వార్తలు