ఏముంది.. అక్కడే పడుకో: భార్య

17 Jan, 2020 08:38 IST|Sakshi

ఉటావా: జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేస్తూ ఓ వ్యక్తి సమయాన్నే మర్చిపోయాడు. దీంతో అతన్ని గమనించని నిర్వాహకులు జిమ్‌ సెంటర్‌కు తాళం వేసి వెళ్లిపోయిన ఘటన అమెరికాలోని ఉటావాలో చోటు చేసుకుంది. వివరాలు.. డేన్‌ హిల్‌ అనే వ్యక్తి ‘24 హవర్స్‌ ఫిట్‌నెస్‌’ అనే జిమ్‌ సెంటర్‌లో చేరాడు. అయితే జనవరి 12న అతను జిమ్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ ప్రపంచాన్నే మర్చిపోయినట్టున్నాడు. ఇక ఇతన్ని ఆ జిమ్‌ నిర్వాహకులు కూడా గమనించనట్టున్నారు. దీంతో అర్ధరాత్రి సమయంలో జిమ్‌ను మూసేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న డేన్‌ జిమ్‌ నుంచి బయటపడే దారి కోసం ప్రయత్నించాడు. కానీ ఏ మార్గం అతని కంట పడలేదు. దీంతో జిమ్‌లో చిక్కుకున్న విషయాన్ని అతను ఫొటోలతో సహా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఈ జిమ్‌ 24 గంటలు తెరిచి ఉండనపుడు దానికి ఆ పేరు ఎలా సూటవుతుంది?’ అని కాస్త విసుగు ప్రదర్శించాడు.

ఇక ఈ పోస్ట్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. జిమ్‌ నుంచి బయటపడే దారి దొరక్కపోవడంతో డేన్‌ తన భార్యకు కాల్‌ చేశాడు. అయితే ఆమె ‘మంచి స్థలం చూసుకుని అక్కడే పడుకొ’మ్మని సలహా ఇచ్చింది. ‘ఏముంది.. అద్దాలు పగలగొట్టి బయటపడు’ అని కొందరు నెటిజన్లు ఐడియాలు ఇచ్చారు. ‘24 హవర్స్‌ ఫిట్‌నెస్‌ అంటే 24 గంటలపాటు లోపలే ఉంచి లాక్‌ చేయడమేమో’ అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. కాగా కాసేపటికే పోలీసులు అతన్ని జిమ్‌ నుంచి బయటికి తీసుకువచ్చేందుకు సహాయం చేశారు. దీనిపై జిమ్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. రాత్రిళ్లు అంతగా ఉపయోగం లేని చోట్ల మాత్రమే జిమ్‌ను క్లోజ్‌ చేస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా