పెంపుడు కుక్క తెచ్చిన అంటురోగం.. విషాదం

12 Apr, 2018 20:21 IST|Sakshi
జాకోనెల్‌కు సెప్‌సిస్‌ వ్యాధి సోకక ముందు, ఆ తర్వాత

మాంచెస్టర్(ఇంగ్లాండ్‌) : ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క తెచ్చిన అంటురోగం కారణంగా రెండు కాళ్లు, తన కుడిచేతి ఐదు వేళ్లు, ముక్కు పోగొట్టుకున్నాడో వ్యక్తి. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాంచెస్టర్‌కు చెందిన సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ జాకో నెల్‌ (50) తన పెంపుడు కుక్కతో రోజూ సరదాగా ఆడుకునే వాడు. ఒక రోజు ఆడుకుంటున్న సమయంలో కుక్క కారణంగా చేతిపై ఓ చిన్న గాయం ఏర్పడింది.

మూమూలు గాయమేకదా అనుకున్న జాకోనెల్‌ దాన్ని సబ్బుతో కడిగి మిన్నకుండిపోయాడు. కొద్ది రోజుల తర్వాత తీవ్రమైన జలుబు ఒళ్లు నొప్పుల కారణంగా మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఒంటి నిండా దురద మొదలైంది. కొద్ది సేపటికే శరీరంలోని భాగాలు నియత్రణ కోల్పోయి నడవటం, మాట్లాడటం, చేతులు సైతం పైకి ఎత్తలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతని భార్య జాకోనెల్‌ను ఆస్పత్రికి తరలించింది. జాకోనెల్‌ పరిస్థితి గమనించిన వైద్యులు అతన్ని ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచారు.

వైద్య పరీక్షల అనంతరం అతనికి పెంపుడు కుక్క కాటు కారణంగా సెప్‌సిస్‌ అనే అంటువ్యాధి సోకిందని వైద్యులు తేల్చారు. అంటువ్యాధి కారణంగా జాకోనెల్‌ రెండు కాళ్లు మోకాలి భాగం వరకు తొలగించేశారు. కుడిచేతి వేళ్లు, ముక్కు భాగాన్ని సైతం తొలగించాల్సి వచ్చింది. జాకోనెల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం బయటకు వెళ్లడానికి కొంచెం బెరుగ్గా ఉందన్నారు. అయినా ఎవరీ మీద ఆధారపడకుండా బతకుతానని, తన రూపం మొత్తం తుడిచిపెట్టుకుపోవడమే కొద్దిగా బాధ కలిగిస్తోందన్నారు.  

మరిన్ని వార్తలు