సింగపూర్ జాతిపిత ఇకలేరు

24 Mar, 2015 02:46 IST|Sakshi
సింగపూర్ జాతిపిత ఇకలేరు

సింగపూర్: సింగపూర్‌ను మహోన్నతంగా తీర్చిదిద్దిన ఆ దేశ మాజీ ప్రధాని లీ క్వాన్ యీ(91) సోమవారం కన్నుమూశారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన సింగపూర్‌ను ప్రపంచస్థాయి వాణిజ్య, ఆర్థిక శక్తిగా మార్చడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. మలేసియా నుంచి సింగపూర్ విడిపోవడంలో కీలకపాత్ర పోషించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సింగపూర్ రాజకీయాలను శాసించిన ఆయన... 31 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. తక్కువ కాలంలోనే ప్రపంచంలోని అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న దేశంగా సింగపూర్‌ను నిలిపారు. కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న లీ క్వాన్ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సింగపూర్ జనరల్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం చికిత్స పొందుతూనే మరణించారు.  క్వాన్ భౌతికకాయాన్ని 28 వరకు పార్లమెంటు హౌజ్‌లో ఉంచనున్నట్లు ఆయన కుమారుడు, ప్రస్తుత ప్రధాని లూంగ్ తెలిపారు. 29న అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
 రాష్ట్రపతి సంతాపం..
 లీ క్వాన్‌మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. లీక్వాన్ మృతితో ఆసియా ఒక మంచి నేతను కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టి ఉన్న లీ క్వాన్ నేతలందరిలో సింహంలాంటి వాడని మోదీ పేర్కొన్నారు. లీ మరణం పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా సంతాపం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని  కెమెరాన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఐరాస ప్రధాన కార్యదర్శి మూన్, పలు దేశాధినేతలు లీక్వాన్‌మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
 ఏపీ శాసనసభ సంతాపం
 సాక్షి, హైదరాబాద్: సింగపూర్ మాజీ ప్రధాని లీ మృతికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం సంతాపం తెలిపింది.  లీ గొప్ప దార్శనికుడని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంలో సింగపూర్ సహకారాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు.
 

మరిన్ని వార్తలు