లెటర్‌ చదివినందుకు రెండేళ్ల జైలు..!

2 Jun, 2019 12:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాడ్రిడ్‌ : పక్కవారి సీక్రెట్స్‌ తెలుసుకోవడం, వారికి వచ్చిన లెటర్స్‌ చదవడం కొందరికి అదో సరదా.. పెద్ద నేరమేమీ కాదులే అని సర్దిచెప్పుకుంటారు. ఎవరికంటైనా పడిదే.. ‘ఇది మర్యాద కాదు’ అని మందలిస్తుంటారు. అయితే, స్పెయిన్‌లో మాత్రం చాలా పెద్ద నేరం. ఎంత పెద్ద నేరం అంటే రెండేళ్ల జైలుశిక్ష పడేంత పెద్ద నేరం. తాజాగా స్పెయిన్‌లోని సెవిల్లే ప్రాంతంలో ఓ సంఘటన జరిగింది. తన పదేళ్ల కుమారుడి పేరుమీద వచ్చిన లేఖను ఓ తండ్రి తెరిచి చదివాడని కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

విషయం ఏంటంటే.. ఆ బాలుడి తల్లి తరపు అత్తమ్మ ఆ లేఖ రాసింది. అందులో ఆ బాలుడి తండ్రిపై గృహహింస కేసుకు సంబంధించిన వివరాలను ఆరా తీసింది. ఆ తండ్రిని విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే, తన భార్య తరపువారు తనను మానసికంగా వేధిస్తున్నారని, తనపై కావాలనే గృహహింస కేసు పెట్టారంటూ కోర్టులో ఆ లేఖను సాక్ష్యంగా సమర్పించాడా ఫాదర్‌​. ఇక్కడే వ్యవహారం బెడిసికొట్టింది. అసలు వేరే వారికి వచ్చిన లేఖను ఎలా చదువుతారంటూ కోర్టు అతడిని ప్రశ్నించింది. ఆ పిల్లాడి గోప్యతకు భంగం కలిగించారంటూ బాలుడి తల్లి తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అంతే కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.

మరిన్ని వార్తలు